చిరస్థాయిగా నిలిచారు
ప్రజల గుండెల్లో ఇందిరమ్మ
టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ● హనుమకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభ
హన్మకొండ చౌరస్తా: ఉక్కు మహిళ ఇందిరమ్మ తన పాలనలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం(ఇందిర మహిళాశక్తి ప్రాంగణం)లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఇందిరమ్మ.. తన తండ్రి నెహ్రూ నుంచి చక్కని పాలనను అలవర్చుకున్నారన్నారు. గరీబ్ హఠావో నినాదంతో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆ స్ఫూర్తితో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యస్థాపనే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కాగా, ఈ సభలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, ఇతర అంశాలపై ప్రసంగించారు.
హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
ప్రభుత్వ హామీల అమలుకు అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడం, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. కాకతీయ మహారాణి రుద్రమదేవి కత్తికి పదునెక్కువ.. కాకతీయుల కళాతోరణానికి మెరుపులు ఎక్కువ. మహిళలను కోటీశ్వరులుగా చేయడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుంది.
– శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆరు జిల్లాలుగా విడదీసి నాశనం చేశారు
చారిత్రక ఉమ్మడి వరంగల్ జిల్లాను గత ప్రభుత్వం ఆరు ముక్కలుగా చేసి నాశనం చేస్తే, రేవంత్‌రెడ్డి సర్కారు కనీవినీ ఎరగని రీతిలో వరాల జల్లు కురిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ఆరు నెలల్లో ఆరుసార్లు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అమలుకు వేలకోట్ల రూపాయలు మంజూరు చేసి చేతల ప్రభుత్వంగా నిరూపించారు. నిధులు సమకూర్చడం జిల్లా ఎమ్మెల్యేలం, మంత్రుల సమైక్య కృషి ఫలితమే. వరంగల్ జిల్లా ప్రజల పక్షాన రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. ఆయన చేసిన అభివృద్ధిని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు.
– నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ
చేతల ప్రభుత్వమని నిరూపించారు
రెండు రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రుల సంతోషాలకు అవధులు లేవు. మునుపెన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసి చరిత్ర తిరగరాశారు. కాంగ్రెస్ అంటే మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని సీఎం రేవంత్‌రెడ్డి నిరూపించారు. రెండు రోజుల్లో వరంగల్ అభివృద్ధికి రూ.5500 కోట్లు మంజూరు చేసిన ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది. వరంగల్ అభివృద్ధికి నిధులు కేటాయించిన రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు ధన్యవాదాలు.
– డాక్టర్ కడియం కావ్య, ఎంపీ వరంగల్
ఉద్యమానికి ఊపిరిపోసిన కవి కాళోజీ
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు తన రచనలతో ఊపిరి పోసిన మహా కవి కాళోజీ నారాయణరావు. నేడు ఆయన కళాక్షేత్ర ప్రారంభోత్సవంలో సాంస్కృతికశాఖ మంత్రిగా ఉండడం సంతోషంగా ఉంది. అబద్ధాలను పదిసార్లు చెబితే నిజాలు అవుతాయనే భ్రమలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేసీఆర్ నిజంగా పాలనాధక్షుడైతే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం రూ. 7లక్షల కోట్ల అప్పులు ఎలా అయ్యాయో చెప్పాలి. 2023కు ముందు రైతులకు భరోసా లేదు, రేవంత్‌రెడ్డి సర్కారులో రుణమాఫీ చేశాం.
– జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి
కులగణనకు సహకరించండి
అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కులగణనకు ప్రజలందరూ సహకరించాలి. ఇప్పటికే 60శాతం పూర్తయింది. కొందరు కావాలని కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వాటిని నమ్మొద్దు. ఉక్కు మహిళ ఇందిరమ్మ దేశంలో పేదరిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల స్ఫూర్తితో నేడు తెలంగాణలో ప్రజాపాలన సాగిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇబ్బంది కలగొద్దని రూ. 240 కోట్లు వెచ్చించి మహిళా సమాఖ్యలతో కలిసి కొత్త బస్సులు కొనుగోలు చేశాం.
– పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
ప్రతీ హామీని నెరవేర్చే బాధ్యత మాది
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే బాధ్యతతో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం. మహిళలకు అండగా ఉంటూ, వారి ఆర్థిక స్వాలంబనకు సహకరించడమే రేవంత్ సర్కార్ లక్ష్యం. – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి
బీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేసిన భూములు తిరిగిచ్చేస్తాం
గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేసిన దేవాదాయ, అటవీ, భూదాన భూములను త్వరలోనే తిరిగి ఆయా శాఖలకు అప్పగిస్తాం. అంతేకాదు భూములు కబ్జా కాకుండా త్వరలోనే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ధరణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చేశాం. ధరణి పేరుతో ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో ప్రతి గజాన్ని లబ్ధిదారులకు అందించేలా చట్టాన్ని రూపొందిస్తాం. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను మహానగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు సొంత బంగ్లా, కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించేందుకు సమయం ఉంది కానీ మహాకవి కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసేందుకు మాత్రం నిధులకు చిత్తశుద్ధి లేదు.
– పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
నా అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి
నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అభిమాన నేత దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇదీ సమస్య అని విన్నవిస్తే చాలు నిధులు కేటాయించేవారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు అడిగిన వెంటనే సమకూరుస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నేను పనిచేశా. శిలాఫలకాలు తప్పితే పైసా ఇవ్వలేదు. వరంగల్ అభివృద్ధికి వారం రోజులు సెక్రటేరియేట్‌లో అధికారులతో సమీక్ష జరిపి కావాల్సిన నిధులు ఇచ్చిన రేవంత్‌రెడ్డికి ప్రజల పక్షాన ధన్యవాదాలు. దశాబ్దాల కల ఎయిర్‌పోర్టు సాకారం కానుంది. తద్వారా పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయి.
– కొండా సురేఖ, రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సమాఖ్యలకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చి స్వాలంబనకు అడుగులు వేశారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. పేద మహిళలు బస్సులో ప్రయాణిస్తే బీఆర్‌ఎస్ నాయకులు దుర్మార్గ ప్రచారం చేశారు. ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు, రూ. 500కే గ్యాస్, 2వందల యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు మహిళల కోసమే అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ది. కాంగ్రెస్ అంటేనే మహిళల ప్రభుత్వం. మహిళల సంక్షేమం కోసం, ఉక్కు మహిళ ఇందిరమ్మ స్ఫూర్తితో పాలన అందిస్తాం. – ధనసరి సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment