దొంగలను పట్టుకుని బంగారం రికవరీ చేస్తాం
రాయపర్తి : త్వరలోనే దొంగలను పట్టుకుని బంగారాన్ని రికవరీ చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఘటనా స్థలికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాగా బ్యాంకుపై భరోసాతో లాకర్లలో దాచుకున్న తమ బంగారాన్ని దొంగలు దోచుకువెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ రాత్రి నుంచి 19 తేదీ తెల్లవారు జామున దొంగలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్‌బీఐ భవనం కిటికీని తొలగించి లోపలికి చొరబడిన 19కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన విధితమే. ఈ సందర్భంగా డీసీపీలు రాజమహేంద్రనాయక్, షేక్ సలీమా, ఏసీపీ నర్సయ్యతో కలిసి సీపీ ఘటనా స్థలిని పరిశీలించారు. చోరీ జరిగిన విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఎస్‌బీఐ లాకర్‌లోని 19 కిలోల బంగారు ఆభరణాలను గ్యాస్ కట్టర్ సాయంతో కోసి చోరీకి పాల్పడింది వాస్తవమేనన్నారు. ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్ పనే అని తెలిపారు. క్లూస్ టీంతో అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు శ్రవణ్‌కుమార్, రామ్‌చరణ్, రాజు తదితరులు ఉన్నారు.
బ్యాంకు అధికారులు సమాధానం
చెప్పడం లేదు
ఎస్‌బీఐపై నమ్మకంతో బంగారు ఆభరణాలను లాకర్‌లలో దాచుకున్నామని, బ్యాంకు పక్కన ఇళ్లు లేకపోవడంతోపాటు సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఖాతాదారులు ఆరోపించారు. ఇప్పటి వరకు బ్యాంకు అధికారులు తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చివరన బ్యాంకు ఏర్పాటు చేయడం.. పక్కన జనావాసాలు లేకపోవడం దొంగలకు ఆవాసంగా మారిందన్నారు. బ్యాంకు పక్కన ముళ్లచెట్లు ఏపుగా పెరిగి నిర్మానుష్య ప్రదేశం ఉండడం వల్లే చోరీ జరిగిందన్నారు. నిర్లక్ష్యం వహించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు ఏం చెప్పడం లేదు
మాది రాయపర్తి మండలకేంద్రం. 13తులాల బంగారాన్ని ఎస్‌బీఐలో తనఖా పెట్టి రూ.4.10లక్షల అప్పు తీసుకున్నా. తీరా బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని తెలిసి బాధగా ఉంది. బ్యాంకుకు వచ్చి అడుగుదామనుకుంటే అధికారులు ఏం చెప్పడంలేదు. మా బంగారాన్ని మాకు ఇప్పించాలి.
– ఎండీ మన్నన్, రాయపర్తి
వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా
చోరీకి పాల్పడింది ప్రొఫెషనల్ గ్యాంగే..
బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment