కేటీఆర్ ధర్నాను అడ్డుకుంటాం..
మహబూబాబాద్ రూరల్ : బీఆర్‌ఎస్ హయాంలో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లగచర్ల ఘటన వెనుక బీఆర్‌ఎస్ కుట్ర ఉందన్నారు. ఖబడ్దార్ కేటీఆర్.. మానుకోటలో ధర్నా ఎలా చేస్తారో చూద్దాం, ఇక్కడి నుంచి తరిమికొడుతామన్నారు. మానుకోటలో అభివృద్ధి పేరిట గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను లాక్కున్నారని, పరిహారంకూడా ఇవ్వలేదన్నారు. మెడికల్ కళాశాల భూముల విషయంలో పోరాడినందుకు వార్డు కౌన్సిలర్ బానోత్ రవిని హత్య చేయించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ భూ కబ్జాలు చేసిన సమయంలో కేటీఆర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఎటుపోయారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు కబ్జాలు చేసిన ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వపరం చేస్తామన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మృతిచెందిన వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ భార్య పూజ మాట్లాడుతూ మెడికల్ కళాశాల భూముల విషయంలో తన భర్తను మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చంపించాడని, నాడే రెండు రూ. కోట్లు, కారు ఇస్తామని చెప్పారన్నారు. సమావేశంలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, కేసముద్రం, మానుకోట ఏఎంసీల చైర్మన్లు ఘంట సంజీవరెడ్డి, ఇస్లావత్ సుధాకర్, ఎండీ.ఖలీల్, అంబటి వీరభద్రం, బండి శ్రీను, గునిగంటి కమలాకర్, నీరుటి లక్ష్మీనారాయణ, చిట్టెం వెంకన్న, ఎదల్ల యాదవరెడ్డి, శంతన్ రామరాజు, గుగులోత్ రాములునాయక్, అరెందుల వెంకటేశ్వర్లు, గుగులోత్ వెంకట్, భూక్య విజయ, చలమల్ల నారాయణ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు శ్రీను, హరిసింగ్, విజయమ్మ, జగన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్,
ఎమ్మెల్యే మురళీనాయక్
Comments
Please login to add a commentAdd a comment