No Headline
హన్మకొండ: రేవంత్ రెడ్డి మాటలు సీఎం హోదాకే అవమానకరమని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్‌లోని వేద బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని విమర్శించే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇరువురిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుస్తామని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని 8 స్థానాల్లో గెలిపించారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 8 స్థానాలు మాత్రమే వచ్చాయన్నారు. కాజీపేటకు వ్యాగన్ పరిశ్రమ మంజూరు చేసి ఇప్పుడు దీనిని కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయిందని విమర్శించారు. వరంగల్ మహానగర అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని తెలంగాణ ద్రోహి అంటే నాలుక చీరుస్తామన్నారు. కిషన్ రెడ్డిని గుజరాత్‌కు వెళ్లు అంటున్న రేవంత్.. మీరు ఇటలీకి పోతారా అని ప్రశ్నించారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ కాకతీయుల గడ్డ ఓరుగల్లుకు స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇచ్చిన ఘనత ప్రధాని మోదీది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడం చూసి ఓర్వలేక చిల్లర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకో అని హితువు పలికారు. నోటి దురుసు మంచిది కాదన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ పెసరు విజయ్ చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గుజ్జ సత్యనారాయణ రావు, కొలను సంతోశ్ రెడ్డి, జయంత్ లాల్, కొండి జితేందర్ రెడ్డి, జనగామ శ్రీనివాస్, చల్ల జయపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment