వేగంగా ఇంటింటి సర్వే.. | - | Sakshi
Sakshi News home page

వేగంగా ఇంటింటి సర్వే..

Published Thu, Nov 21 2024 1:10 AM | Last Updated on Thu, Nov 21 2024 1:10 AM

వేగంగా ఇంటింటి సర్వే..

వేగంగా ఇంటింటి సర్వే..

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వేగం పుంజుకుంది. మొదట ఇబ్బందిపడిన ఎన్యుమరేటర్లు..ప్రస్తుతం గాడినపడ్డారు. అయితే జిల్లాలో అధికారుల లెక్కలకు మించి కుటుంబాల సంఖ్య పెరగడంతో ఎన్యుమరేటర్లపై అదనపు భారం పడుతోంది. అయితే సర్వే త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిరావడంతో క్షేత్రస్థాయిలో వేగం పెంచారు. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘాపెట్టి సర్వేను వేగవంతం చేస్తున్నారు.

పెరిగిన కుటుంబాలు

ప్రభుత్వం నిర్వహించే ఆర్థిక, సామాజిక, కుల, ఉద్యోగ, ఆదాయ సర్వేకోసం జిల్లాలోని 18మండలాల పరిధిలోని 461గ్రామ పంచాయతీలు,అందులోని కుటుంబాల వివరాలు సేకరించారు. ముందుగా స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం 2,45,939 కుటుంబాలు ఉంటాయని అంచనా వేశా రు. అయితే తర్వాత మరోసారి లెక్కించగా కుటుంబాల సంఖ్య 2,66,603కు చేరింది. అంటే ముందుగా వేసిన లెక్కలకు 20,664 కుటుంబాలు పెరిగా యి. సర్వేపూర్తయ్యే నాటికి మరిన్ని కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎన్యుమరేటర్లపై భారం..

ముందుగా వేసిన లెక్కల ప్రకారం ఒక్కో ఎన్యుమరేటర్‌ ప్రతీరోజు 15 కుటుంబాలు సర్వే చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,884 మంది అవసరం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్‌, ఐసీడీఎస్‌, గ్రామీణాభివృద్ధి మొదలైన శాఖలకు చెందిన వారికి డ్యూటీలు వేశారు. అయితే ఇందులో కొంతమంది ఆరోగ్యం, కుటుంబ కారణాలతో సర్వే చేయలేమని అధికారులకు విన్నవించి వైదొలిగారు. అదేవిధంగా డ్యూటీలు వేసే అధికారులకు అవగాహన లేకపోవడంతో మరికొందరికి ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించారు. ఇలా ఎన్యుమరేటర్ల సంఖ్యను 2,034కు పెంచారు. అయినప్పటికీ కుటుంబాలకు సరిపడా ఎన్యుమరేటర్లను పెంచేందుకు వీలుకాలేదు. కాగా ముందుగా ప్రతీరోజు 15 కుటుంబాల సర్వే చేయాలని చెప్పగా.. ప్రస్తుతం 20కి పైగా కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. ఒక్కో ఎన్యుమరేటర్‌ 175 నుంచి 180 వరకు కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది.

సర్వే వివరాలు

జిల్లాలో కుటుంబాలు

అర్బన్‌ : 38,845

రూరల్‌ : 2,27,758

మొత్తం : 2,66,603

సర్వే పూర్తి చేసిన కుటుంబాలు

అర్బన్‌ : 35,267(90.8శాతం)

రూరల్‌ : 2,01,233(88.4శాతం)

మొత్తం : 2,36,500(88.7శాతం)

గాడినపడిన ఎన్యుమరేటర్లు

పెరిగిన కుటుంబాలతో అదనపు భారం

89శాతం సర్వే పూర్తి..

మిగిలింది 30వేల కుటుంబాలే..

ఆలస్యంగా ప్రారంభమై..

ఒక్కో ఇంటి సర్వేకు అర్ధగంట సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే సర్వే చేసేవారిలో కొందరు వయస్సు మీదపడిన వారు, కంటి చూపు మందగించిన వారు, తక్కువ చదువుకున్నవారు ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికీ పలు కుటుంబాల ఇంటి ముందు స్టిక్కర్లు అంటించకపోవడంతో ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. అదేవిధంగా సర్వేకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే, మరోరోజు వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు సర్వేకు సహకరించకపోగా.. ఎదురు ప్రశ్నలు వేసి విసిగిస్తున్నట్లు ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. మొత్తంగా తొలినాళ్లతో పోలిస్తే సర్వే వేగం పుంజుకుందని ఎన్యుమరేటర్లు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement