ప్రియాంకగాంధీకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
మహబూబాబాద్ రూరల్: వయనాడ్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రియాంకగాంధీని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంకగాంధీ గెలుపులో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎంపీ బలరాంనాయక్ కృతజ్ఞతలు చెప్పారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
బయ్యారం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోలీసుల పనితీరుతో పాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.
మహిళలకు రిజర్వేషన్లుఅమలు చేయాలి
నెహ్రూసెంటర్: అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధికి 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊకే పద్మ, గుజ్జు కృష్ణవేణి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో శారద అధ్యక్షతన సంఘం పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వేషన్ అమలు, హక్కుల సాధనకై సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని, అందుకు కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షురాలిగా బట్టు బిన్నమ్మ, కార్యదర్శిగా పొన్నం రమ, ఉపాధ్యక్షురాలిగా శివ్వారపు శారద, సహాయ కార్యదర్శిగా ధనసరి నాగమణి, కోశాధికారిగా చిలుక మౌనిక ఎన్నికయ్యారు.
ఎంపీడీఓల సంఘం
జిల్లా కమిటీ ఎన్నిక
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా ఎంపీడీఓల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు శుక్రవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ నర్మద శుక్రవారం తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా పెద్దవంగర ఎంపీడీఓ బి.వేణుమాధవ్, ఉపాధ్యక్షులుగా మరిపెడ ఎంపీడీఓ విజయ, ప్రధాన కార్యదర్శిగా కురవి ఎంపీడీఓ కె. వీరబాబు, కోశాధికారిగా నెల్లికుదురు ఎంపీడీఓ డి.బాలరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేసముద్రం ఎంపీడీఓ జె.క్రాంతి, కమిటీ సభ్యులుగా దంతాలపల్లి ఎంపీడీఓ ఎన్.వివేక్‌రామ్, చిన్నగూడూరు ఎంపీడీఓ రామారావును ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు జెడ్పీ సీఈఓ పురుషోత్తంను మార్యదపూర్వకంగా కలిసి సన్మానించారు.
డిగ్రీ పరీక్షల్లో 23 మంది మాల్‌ప్రాక్టీస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో శుక్రవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ 23 మంది విద్యార్థులు పట్టుబడగా వారిని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాఽధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ వెంకటయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment