కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి
● కేంద్రాలకు పెయింటింగ్
● ప్రీ స్కూల్ విధానం అమలు
● పిల్లలకు యూనిఫాం అందజేత
పెయింటింగ్ పూర్తి అయిన మరిపెడ మండలం ఆయుధాలగడ్డతండా కేంద్రం
కేంద్రాల భవనాలకు వేసిన పెయింటింగ్ బొమ్మలు ఇవే
మహబూబాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ స్కూల్ విధానం అమలు చేయడంతో పాటు యూనిఫాం, విద్యాబోధనలో మార్పు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్రాలు అందంగా, ఆకర్షనీయంగా కనిపించేందుకు పెయింటింగ్ వేస్తున్నారు. ఈమేరకు నిధులు కేటాయించారు. కాగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తుండడంతో నిర్వహణ కూడా గాడిన పడింది.
1,435 కేంద్రాలు..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల్లో ఏడు నెలలలోపు పిల్లలు 4,097మంది, ఏడు నెలల నుంచి ఏడాదిలోపు పిల్లలు 4,001మంది, ఏడాది నుంచి మూడు సంవత్సరాలలోపు వారు 15,774 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 15,861 మంది, బాలింతలు 3,864 మంది, గర్భిణులు 4,105 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 339 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా.. 452 కేంద్రాలు అద్దె భవనాలు, 644 కేంద్రాలు అద్దె లేకుండా (ప్రీరెటెండ్) భవనాల్లో కొనసాగుతున్నాయి. 58 సెక్టార్‌లు ఉండగా 58 మంది సూపర్‌వైజర్లకు గాను 47 మంది ఉన్నారు. 21నుంచి 25 కేంద్రాలకు ఒక సూపర్‌వైజర్ విధులు నిర్వర్తిస్తున్నారు. 1,435 మంది టీచర్లకు 1,331 మంది ఉండగా 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు 1435మందికి 982 మంది ఉండగా 451పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
ప్రభుత్వ ఆదేశాలతో ...
ప్రభుత్వ ఆదేశాలతో సంబంధిత అధికారులు తరచూ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలను తెరిచే ఉంచుతున్నారు. అధికారులతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్లు కూడా కేంద్రాలను తనిఖీ చేయడంతో టీచర్లు మరింత అప్రమత్తమయ్యారు. దీంతో కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉంది.
పెయింటింగ్‌కు రూ.19,60,000 కేటాయింపు..
గతంలో 40 కేంద్రాలను ఎంపిక చేసి మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల భవనాలను పెయింటింగ్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఆట వస్తువులతో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు. కాగా మొదటి విడతలో పెయింటింగ్ కోసం రూ.19,60,000 విడుదల చేశారు. ప్రతీ కేంద్రానికి రూ.49,000 కేటాయించారు. కాగా 32 కేంద్రాల్లో పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన 8 కేంద్రాలు కూడా వారం రోజుల్లో పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. మరో విడతలో విడుదలయ్యే నిధులను బట్టి కేంద్రాలను ఎంపిక చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment