నకిలీ మిర్చి విత్తనాలతో మోసం
గార్ల: నకిలీ మిర్చి విత్తనాలతో పంట సాగు చేసి గిరిజన రైతులు మోసపోయారు. కాయలు సన్న రకం బదులు దొడ్డుగా కాయడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఘటన గార్ల మండలం కేళోత్‌తండాలో జరిగింది. ఈ మేరకు తండాకు చెందిన భూక్యా మోహన్, కేళోత్ బుజ్జి, భూక్యా వీరన్న, కేళోత్ మున్ని, కేళోత్ నరేశ్ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించిన బోరున విలపించారు. సదరు రైతులు వేలాది రూపాయలు వెచ్చించి ఖమ్మం జిల్లా వైరాలోని లోకేశ్వరి మిర్చి నర్సరీ నుంచి మిరప నారు కొనుగోలు చేసి సాగు చేపట్టారు. ప్రస్తుతం తోట కాతకు రాగా కాయలు సన్నరకం బదులు దొడ్డుగా కాశాయి. తోటలో సుమారు 50శాతం దొడ్డురకం కాయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తాము సాగు చేసిన మిర్చితోటలను సందర్శించి, వైరా నర్సరీ యజమాని నుంచి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, అదే గ్రామానికి చెందిన కేళోత్ సురేశ్, గుగులోత్ కిషన్.. ఖమ్మంలోని ఓ విత్తన దుకాణం నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. వీరి తోటల్లో కూడా దొడ్డు రకం కాశాయని, తమకు కూడా పరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏఓ కావటి రామారావును ‘సాక్షి’ వివరణ కోరగా జన్యు స్వచ్ఛత నిర్ధారణ కోసం శాస్త్రవేత్తలను పిలిపించి ఈ మిర్చితోటలను పరిశీలించాక జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు నివేదికను పంపనున్నట్లు వెల్లడించారు.
తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులు
వైరా నర్సరీపై చర్యలకు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment