అవ్వకు ఆదరణ కరువు
ఎముకలు కొరికే చలి ఓవైపు. రణగొణ ధ్వనులు మరోవైపు. దోమలు, ఈగలు, కుక్కలకై తే లెక్కే లేదు. వీటన్నింటి మధ్య ఓ మాతృమూర్తి గజగజా వణుకుతూ కాలం వెళ్లదీస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎవరు తీసుకొచ్చి వదిలేశారో తెలియదు. అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. బాటసారులు, పండ్ల వ్యాపారులు ఇచ్చే పదార్థాలు తిని బతుకుతోంది. కాజీపేట త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న గేట్‌వాల్వ్ నీటిని తాగుతూ.. కాలకృత్యాలు తీర్చుకుంటోంది. కడుపు నింపుకోడానికి వణుకుతున్న చేతిని చాచిన ఆ అవ్వను ‘సాక్షి’ పలుకరించగా.. తన పేరు లచ్చమ్మ అని మాత్రం చెప్పింది. వివరాలేమీ వెల్లడించలేదు. ఆదరణ కరువైన ఆ అవ్వను కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు.
– కాజీపేట
దంపతుల మధ్య గొడవ..
క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్య
● అనాథలుగా మారిన పిల్లలు
● గిర్మాజీపేట లక్ష్మీపురంలో ఘటన
వరంగల్: ఏదో తెలియని సమస్యపై దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో ఇద్దరూ క్షణికావేశానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈఘటన వరంగల్ గిర్మాజీపేట లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షుకుర్, స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీపురానికి చెందిన ఓని రమేశ్(35), తిరుపతమ్మ(30) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు గౌతమ్, గణేశ్ సంతానం. ఈ క్రమంలో రమేశ్ రోజూ వివిధ కారణాలతో భార్యతో గొడవ పడే వాడు. బుధవారం రాత్రి కూడా గొడవ చేయడంతో జీవితంపై విరక్తి చెందిన తిరుపతమ్మ.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోవడంతో భయపడిన రమేశ్ కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, దంపతులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వీరిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈఘటపై మృతుడి సోదరుడు ఎల్లస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ షుకుర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment