వృద్ధుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన కాటారం పోలీసులు
కాటారం: భూ వివాదం నేపథ్యంతో కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెం కాలనీలో ఈ నెల 27న జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటారం సీఐ ఈ.నాగార్జునారావు, ఎస్సైలు మ్యాక అభినవ్, శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డొంగిరి బుచ్చయ్య(65), సోదారి పవన్, సోదారి లింగయ్య, సోదారి శోభ మధ్య కాటారం శివారులోని లావాణిపట్టా భూమి 30 గుంటలకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. పలుమార్లు పంచాయితీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. నిందితులు భూమిని దున్నిన ప్రతీసారి మృతుడు బుచ్చయ్య అడ్డుపడుతూ వచ్చేవాడు. దీంతో బుచ్చయ్యను ఎలాగైనా అంతమొందించాలని నిందితుడు పవన్ అతడి తల్లిదండ్రులు లింగయ్య, శోభ పథకం పన్నారు. ఈ నెల 27న ఇప్పలగూడెంకాలనీలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బుచ్చయ్యను కర్రదుంగతో విచక్షణరహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మృతుడి భార్య సారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పవన్, లింగయ్య, శోభను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment