మరింత సహకారం
కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ పథకాలు మరింత చేరువలోకి తీసుకొచ్చేందుకు పీఏసీఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, ఇతర సబ్సిడీ పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందుకోసం 45 అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త సంఘాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
జిల్లాలో ఎనిమిది
కొత్త సంఘాలు..
ఉమ్మడి జిల్లాలో ప్రతీ మండల కేంద్రంతో పాటు పలు మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా పాలకవర్గాలను ఎన్నుకుంటారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల విస్తరణ జరగలేదు. దీంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటి వరకు జిల్లాలో 19 సంఘాలు ఉండగా.. ప్రస్తుతం మరో ఎనిమిది కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
45 అంశాల్లో పరిశీలన..
కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు కోసం రాష్ట్ర ఉన్నతాధికారులు 45 అంశాలను పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌కు కొత్త పీఏసీఎస్‌కు మధ్య దూరం కనీసం 10కిలో మీటర్లకు పైగా ఉండాలి. విభజనలో కొత్త పీఏసీఎస్ పరిధిలోకి ఎన్ని గ్రామాలు వెళ్తున్నాయి. సభ్యులు ఎంత మంది, కొత్త సంఘం ఏర్పాటుకు ఉద్యోగులు ఎంత మంది అవసరం, కార్యాలయం ఏర్పాటుకు ఖర్చు ఎంత అవుతుంది.. ఎంత సాగు భూమి ఉంటుంది. సీజన్ వారీగా ఎరువులు, విత్తనాలు, ఇతర సబ్సిడీ పరికరాల పంపిణీ, టర్నోవర్ ఎంత.. ఇలా మొదలైన అంశాలను పరిశీలించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధం అవుతున్నారు.
రైతుకు చేరువలో..
కొత్తగా ఏర్పాటు చేసే పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేసే పథకాలు చేరువలోకి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న 19 సంఘాల పరిధిలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగూడ మండలంలో పొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు తోడుగా కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లో, గూడూరు పీఏసీఎస్ పరిధిలోని అప్పరాజుపల్లి, అయోధ్యపురం, గార్ల సంఘం పరిధిలోని రాంపురం, కొత్తగా ఏర్పడిన దంతాలపల్లి, చిన్నగూడూరు, ఇనుగుర్తి ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది కొత్త సంఘాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సౌకర్యంగా ఉండటం, పరిపాలనా పరమైన ఇబ్బందులు తొలగనున్నాయి.
రైతులకు సౌకర్యంగా ఉండాలి
ఇంతకు ముందు ఆగపేటలో పీఏసీఎస్ ఉండేది. దానిని రద్దు చేసిండ్రు. మా పాత మండలంలో పీఏసీఎస్ ఉంది. మండలం మారింది. పీఏసీఎస్ కూడా మారితే రైతులకు సౌకర్యంగా ఉంటుంది. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటారు. – గుండాల అయిలయ్య,
దాట్ల, దంతాలపల్లి మండలం
ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం
రైతులు, ప్రజాప్రతినిధుల కోరిన విధంగా జిల్లాలో కొత్తగా ఎనిమిది పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్ని వివరాలు తెలుపుతూ.. కొత్త సంఘాల ఏర్పాటు అవసరాన్ని కూడా వివరించి చెబుతున్నాం.
– వెంకటేశ్వర్లు, డీసీఓ, మహబూబాబాద్
మందుబత్తాలకు ఇబ్బంది అవుతుంది
పొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు పోయి విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కొత్తగూడలో ఇంతకు ముందు రైతు సంఘం ఉండేది. దానిని తీసేసిండ్రు. ఇప్పుడు మళ్లీ పీఏసీఎస్ పెట్టాలి. దగ్గరలో ఉన్న సంఘానికి పోయి అన్ని తెచ్చుకుంటాం.
– మల్లెల శ్రీహరి, కొత్తపల్లి, కొత్తగూడ మండలం
అయోధ్యపురంలో ఏర్పాటు చేయాలి
అయోధ్యపురంలో పీఏసీఎస్ ఏర్పాటు చేస్తే గాజుల గట్టు, మదనాపురం, గుండెంగ, పొనుగోడు, రాములు తండా, నాయకపల్లి, తీగలవేణి, బొల్లెపల్లి గ్రామాల రైతులకు మేలు జరుగుతుంది. గతంలో రైతు సహకార సొసైటీల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, మందులు, రుణాలు, వ్యవసాయ పనిముట్లు లభించేది. ఇక్కడ పీఏసీఎస్ ఏర్పాటు చేస్తే తిరిగి మళ్లీ రైతులకు అలాంటి సేవలు లభిస్తాయి.
– నలమాస యాకయ్య గౌడ్, రైతు, అయోధ్యపురం, గూడూరు మండలం
●
నూతన మండలాలు, మారుమూల ప్రాంతాలకు విస్తరణ
జిల్లాలో ఎనిమిది
పీఏసీఎస్‌ల ప్రతిపాదనలు
పరిగణనలోకి 45 అంశాలు
కసరత్తు ప్రారంభించిన అధికారులు
పీఏసీఎస్‌ల వివరాలు..
జిల్లాలో మొత్తం పీఏసీఎస్‌లు: 19
సహకార బ్యాంకులు: మరిపెడ, తొర్రూరు, గార్ల, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు
కొత్తగా ఏర్పాటు చేసే పీఏసీఎస్‌లు: కొత్తగూడ, గంగారం, అప్పరాజుపల్లి, అయోధ్యపురం, దంతాలపల్లి, చిన్నగూడూరు, ఇనుగుర్తి, రాంపురం(గార్ల మండలం)
Comments
Please login to add a commentAdd a comment