సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

Published Thu, Jan 9 2025 1:38 AM | Last Updated on Thu, Jan 9 2025 1:38 AM

సమీపి

సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

సూచనలివే..

విద్యార్థుల సన్నద్ధతపై టీచర్లు, లెక్చరర్ల దృష్టి

ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు

విద్యారణ్యపురి: పరీక్షలు సమీపిస్తున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు చదువుల్లో మునిగిపోయారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి, టెన్త్‌.. మార్చి 21 నుంచి జరగనున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల విద్యా సంస్థలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈనేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా చదివితే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెబుతున్నారు.

90 రోజుల ప్రణాళిక

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధి కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులకు 90 రోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యాబోధన కొనసాగుతోంది. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ రూపొందించినట్లుగా ప్రతీ కళాశాలలో సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి బోధిస్తున్నారు. స్టడీ అవర్స్‌, యూనిట్‌ టెస్టులు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన కొనసాగుతోంది. ఈనెల 20 నుంచి ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. కొన్నిచోట్ల సబ్జెక్ట్‌ సిలబస్‌ పూర్తి కాగా.. మరికొన్ని చోట్ల రివిజన్‌ క్లాసులు కొనసాగుతున్నాయి. కాగా.. విద్యాబోధనను పర్యవేక్షించేందుకు ఇంటర్‌ బోర్డ్‌ ఉమ్మడి జిల్లాకు నియమించిన అబ్జర్వర్‌ (ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ డిప్యూటీ సెక్రటరీ) టి.యాదగిరి మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలలను పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. అత్యధిక ఉత్తీర్ణత సాధించేలా సూచనలిచ్చారు.

స్పెషల్‌ క్లాసులు..

ఉమ్మడి జిల్లాలో టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి విద్యను బోధిస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బాగా చదివే విద్యార్థులను గుర్తించి వారికి 10/10 జీపీఏ వచ్చేలా కృషి చేస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా సూచనలు చేస్తున్నారు.

● పరీక్షలు అంటే భయం ఉండకూడదు. సమయాన్ని వృథా చేయకుండా సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

● సిలబస్‌ పూర్తయ్యిందని ఇంటి వద్దే ఉండొద్దు. తరగతులకు హాజరైతే పునఃశ్చరణ, సందేహాల నివృత్తి జరుగుతుంది. స్టడీఅవర్స్‌లో ప్రత్యేక శ్రద్ధతో చదువుకునే అవకాశం పాఠశాలలు,కళాశాలల్లో ఉంటుంది.

● పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేస్తే పరీక్ష పద్ధతులు తెలుస్తాయి.

● పిల్లలు చదువుతున్నారా లేదా అని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారి చదువుకు సహకరించాలి.

● ఆత్మవిశ్వాసం పెంచడం.. ఒత్తిడి లేకుండా పిల్లలను ప్రోత్సహించి, వారి ప్రగతిని ప్రశంసించడం.

● భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మ్యాథమెటిక్స్‌లోని భావనలు నేర్చుకోవడం.

● సూత్రాలు, సిద్ధాంతాలు అవగాహన: ముఖ్యమైన సిద్ధాంతాలను బాగా అర్థం చేసుకోవడం.

● ప్రయోగాలు, పటాలు, ఉదాహరణలు, అప్లికేషన్లు ప్రాక్టీసు చేయాలి.

● విద్యార్థులు చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి.

ఆరోగ్యమూ ముఖ్యమే..

● ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి.

● పరీక్షలు ముగిసే వరకు మాంసాహారం జోలికి వెళ్లకపోవడం మంచిది. అదేవిధంగా జంక్‌ఫుడ్స్‌, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.

● కనీసం రోజు 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం యోగా, ధ్యానం వంటివి చేస్తే ఆక్సిజన్‌ పూర్తిస్థాయి అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

● రోజూ గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని చదవకుండా.. మధ్యమధ్యలో కాసేపు విరామం ఇవ్వాలి. కొద్దిసేపు ఇంట్లోనే అటు, ఇటు తిరిగితే రిలాక్స్‌గా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు 1
1/1

సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement