ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య
నెహ్రూసెంటర్: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆకుల రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే దేశ భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. అదానీ, అంబానీలకు వేల కోట్ల రూపాయల మాఫీలు, రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందుత్వాన్ని అమలు చేయాలని భావిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల ప్రత్యేక అధికారాలు, ఉనికిని దెబ్బతీసేందుకు దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా అందించి రైతులను ఆదుకోవాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సోమయ్య, వీరయ్య, ఉపేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment