వేతనాలు పెండింగ్..
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెండింగ్‌లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు రాక అప్పులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనాలు నెలనెలా అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోతున్నారు.
203 మంది ఉద్యోగుల సమస్య
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. కాగా మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్‌లో 203 మంది పని చేస్తున్నారు. వారిలో 143 మందిని పారిశుద్ధ్య కార్మికులుగా ఉపయోగించుకుంటుండగా.. మిగిలిన వారిని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం, వాటర్‌సప్లై, కంప్యూటర్ ఆపరేటర్లుగా వివిధ పనులకు ఉపయోగించుకుంటున్నారు. కాగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సిబ్బందిని పెంచాలని సీడీఎంఏను పలుమార్లు కలిసినా ఫలితం లేకపోయింది. దీనికితోడు వేతనాలు సక్రమంగా రాకపోవడం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది.
మూడు నెలల వేతనాలు పెండింగ్..
మున్సిపాలిటీలో 203 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గాను ప్రతీనెల జనరల్‌ఫండ్ నుంచి రూ.40 లక్షలు కేటాయిస్తున్నామని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు చెందిన వేతనాల బిల్లులు ఎస్టీఓకు పంపించినట్లు అధికారులు తెలిపారు. రూ.1.25కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేశారు. గతంలో ఎస్టీ నుంచి బ్యాంక్‌లో జమ అయ్యేవి. కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఎస్టీఓ నుంచి ఈ–కుబేర్‌కు వెళ్లి ఆ తర్వాత బ్యాంక్‌లో జమ అవుతున్నాయి. కాగా ఈ–కుబేర్‌లోనే మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ప్రతీనెల వేతనాలు వేస్తున్నాం..
2024కు సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వేతనాలు వేశాం. కానీ ఈ–కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే ఆ ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. ఈ కుబేర్ కాకుండా ఎస్టీఓ నుంచి బ్యాంక్‌కు జమ చేస్తే ఈ సమస్య ఉండదు. – లింగాల కుమార్,
అకౌంటెంట్, మానుకోట మున్సిపాలిటీ
మానుకోట మున్సిపాలిటీలో మూడు నెలలుగా అందని జీతాలు
ఇబ్బందులు పడుతున్న
పారిశుద్ధ్య కార్మికులు
అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment