మక్తల్/మాగనూర్: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 100 విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌కు గురికావడం ఆందోళనకరంగా మారింది. బుధవారం మధ్యా హ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు పెట్టారు. ఇది తిన్న కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడారు. అయితే మొదట తేలికగా తీసుకున్న ఉపాధ్యాయులు.. బాధితులు పెరగడంతో ఏఎన్‌ఎం, ఆశాలను పాఠశాలకు పిలిపించి చికిత్స అందించారు. వారు విద్యార్థుల పరిస్థితిని గమనించి స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ను సైతం పాఠశాలకు పిలిపించారు. ఆయన 17 మంది విద్యార్థులకు చికిత్స అందించి.. అందులో 15 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, నందిని, అనిల్, నవ్య, మేఘన, శివ, జగదీశ్, మహేష్, విజయ్, భీమశంకర్, రాకేష్, విజయ్‌కుమార్, మధు, ప్రశాంతి, శివసాయి ఉన్నారు.
అపరిశుభ్రంగా వంట గది..
విద్యార్థులకు వంట చేసేందుకు నిర్మించిన వంట గదితో పాటు పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. చెత్తాచెదారం మొత్తం అక్కడే వేస్తున్న పరిస్థితులు కనిపించాయి. వంట చేసేందుకు వినియోగించిన కూరగాయలు, కారం పొడి తదితర సామగ్రి మొత్తం వంట ఏజెన్సీ వారు ఎప్పటికప్పుడు బయటి నుంచి తీసుకువస్తున్నారని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు వాపోయారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి వీరే వంట చేస్తున్నారని, వీరిని మార్చాలని డిమాండ్ చేస్తున్నా.. ఉపాధ్యాయులు మాత్రం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులకు శుద్ధి నీరు అందించే ఫిల్టర్ వాటర్ మిషన్ సైతం మరమ్మతుకు గురైనా బాగు చేయకపోవడంతో.. నిత్యం మిషన్ భగీరథ నీరు తాగుతున్నారు.
మక్తల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 15 మందికి సీరియస్
Comments
Please login to add a commentAdd a comment