కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు.
ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్
ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. గోషామహల్‌లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు.
● సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ కోరారు.
● కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
● హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు.
జీరో అవర్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ
Comments
Please login to add a commentAdd a comment