తెల్లవారుజామున 4 గంటలకు రైతు బజార్ లో కూరగాయలకు తీసుకెళుతున్న రైతు
చలి పంజా విసురుతున్న వేళ.. బెంబేలెత్తి ముసుగు తన్నిన వేళ.. ఇలా పట్టణమంతా ప్రశాంతంగా కునుకు తీస్తున్న వేళ.. వారు మాత్రం పరుగులు పెడుతున్నారు. తమ కుటుంబాలను పోషించుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. పగలుతోపాటు రాత్రిళ్లూ కష్టపడుతున్నారు. తమకు తోచిన పనిచేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద వర్గాలు నిశీధిలో సాగిస్తున్న జీవన ప్రయాణంపై మహబూబ్‌నగర్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ‘సాక్షి’ బృందం పరిశీలన చేపట్టింది. వణికిస్తున్న చలిలోనూ అలుపెరగకుండా శ్రమిస్తున్న ఆ కుటుంబ సారధులు తమ జీవన పోరాటంపై ఏమన్నారో వారి మాటల్లోనే..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/పాలమూరు/జెడ్పీ సెంటర్/మున్సిపాలిటీ
చలితో వ్యాపారం తగ్గింది..
నేను ఉదయం వేరే పని చేస్తా. రాత్రి వేళ నా స్నేహితుడి చాయ్ దుకాణాన్ని నడిపిస్తూ కొంత సంపాదించుకుంటున్నాను. ఇంతకు ముందు చాయ్ బాగా పోయేది. యువకులే ఎక్కువ మంది వచ్చేవారు. చలి పెరగడంతో రాత్రి బయటకు రావడం లేదు. దీంతో వ్యాపారం తగ్గింది.
– శివ, సన్నీ చాయ్ సెంటర్, తెలంగాణ చౌరస్తా
రాత్రి గిరాకీ ఎక్కువ..
నాకు ఆటోనే జీవనాధారం. ప్రతి రోజు అర్ధరాత్రి నుంచి తె ల్లారి 5 గంటల దాకా నడుపు తా. రైళ్ల టైమింగ్ ప్రకారం సవారి వేసుకుంటా. రాత్రి బస్టాండ్ వద్ద ఎక్కువ గిరాకీ ఉంటుంది. మొత్తంగా రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తా. ఉదయం కూడా ఆటో నడుపుతా.
– ఎండీ హజీమ్, ఆటో డ్రైవర్, మహబూబ్‌నగర్
కుటుంబ పోషణకు తప్పదు కదా..
ఎకరంనర భూమిలో కొత్తిమీర, మెంతికూర, పాలకూర, పుంటి కూరలు పండిస్తున్నా. ఒక రోజు ముందు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెంపి.. కట్టలు కట్టుకుని తెల్లవారు జామున 2 గంటలకు ఆటోలో మార్కెట్‌కు వస్తాను. ఆటో కిరాయి, ఇతర ఖర్చులు పోనూ నాకు రూ.700 మిగులుతానయ్. ఎంత చలి అయినా కుటుంబ పోషణకు తప్పదు కదా.
– సుగుణమ్మ, మహిళ రైతు, సల్లోనిపల్లి, హన్వాడ
కడుపు నిండాలంటే పనిచేయాలి..
మార్కెట్‌ను నమ్ముకుని జీవిస్తున్నాం. మొత్తం 20 మంది వరకు హమాలీలు ఉన్నాం. రాత్రి 9 గంటలకు వచ్చి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా ఉంటాం. మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తాయి. 50 కిలోల సంచి అన్‌లోడ్ చేస్తే రూ.8.. 20 కిలోల బాక్స్‌కు రూ.5 చొప్పున మాకు కూలీ పడుతుంది. చలి కాలం పనికి రావాలంటే కొంత ఇబ్బందే. కడుపు నిండాలంటే పని చేయక తప్పదు. చలి కాలం కొన్ని రకాల కూరగాయలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని దింపాలంటే హమాలీలు కావాల్సిందే. రాత్రి మొత్తం కష్టపడితే ఒక్కరికి రూ.500 నుంచి రూ.600 వరకు కూలీ పడుతుంది. – మార్కెట్ హమాలీలు
Comments
Please login to add a commentAdd a comment