బీఆర్‌ఎస్ హయాం, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అనిల్‌జాదవ్ విలేకరులతో మాట్లాడారు. లగచర్ల ఘటనపై చర్చకు రెండ్రోజులుగా పట్టుబట్టినా ప్రభుత్వం పారిపోయిందని, సభా నియమాలపై నీతులు చెబుతూ ప్రభుత్వమే ఉల్లంఘించిందని ఆరోపించారు. పాలక పక్షం ప్లకార్డులు లోనికి తెస్తే స్పీకర్ ఎలా అనుమతించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు కన్నీరు పెడుతుంటే సీఎం, మంత్రులు జల్సాలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని, లగచర్లపై ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రహసనంగా మార్చేసిందని, అన్ని వ్యవస్థలను సీఎం రేవంత్ నిర్వీర్యం చేశారని విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లపై కేసులు, అరెస్టులు అంటూ నాలుగు గోడల మధ్య ఉండి రేవంత్ వార్తలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా వన్ మీద దమ్ముంటే చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసాలపై చర్చకు సిద్ధమని, దమ్ముంటే శాసనసభను పదిహేను రోజులు నడపాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందని, అన్నింటికీ ఎదురొడ్డి ప్రజల పక్షాన పోరాడతామని చెప్పారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సవాల్
Comments
Please login to add a commentAdd a comment