జోరందుకున్న వరి నాట్లు
ఈసారి సన్న రకాల సాగుకే మొగ్గు
●
18 ఎకరాల్లో సన్నాలు
నాకున్న నాలుగున్నర ఎకరాలతోపాటు మరో 14 ఎకరాలు కౌలుగా తీసుకొని మొత్తం 18 ఎకరాల్లో వరి నాటు వేశాను. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో ఈసారి మొత్తం సన్నాలే సాగు చేశాను. అయితే ఎండల తీవ్రత, విద్యుత్ కోతలు, అకాల వర్షాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా వరి నాట్లు వేస్తే ఏప్రిల్‌లోపే పంట చేతికొస్తుందని భావిస్తున్నాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, మాచన్‌పల్లి,
మహబూబ్‌నగర్ రూరల్ మండలం
అందుబాటులో ఎరువులు,
విత్తనాలు
యాసంగి సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేస్తున్నాం. ఇందులో 90 శాతం సన్నాలు, 10 శాతం దొడ్డు రకం సాగు చేస్తారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మండల స్థాయిలో ఏఓలు, క్లస్టర్ స్థాయిలో ఏఈఓలు అందుబాటులో ఉంటారు.
– వెంకటేష్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో యాసంగి సాగు జోరందుకుంది. ఆరుతడి పంటలు వేసిన రైతులు వరి సాగు మొదలుపెట్టారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, బోరు, బావుల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో ఈసారి రైతులు ఎక్కువగా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం బోనస్ కూడా ఇస్తుండటంతో యాసంగిలోనూ సన్న రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. నవంబరు నెలాఖరు వరకు నారుమడులు సిద్ధం చేసిన రైతులు ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలోని రైతులు ఒకేసారి వరినాట్లను మొదలు పెట్టడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వాతావరణం చల్లబడినా.. బోర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువైంది. యాసంగిలో ఎండలు ముదరక ముందే పంటలు చేతికి వచ్చే విధంగా రైతులు ముందస్తుగా సాగును కొనసాగిస్తున్నారు.
90 శాతానికి పైగా..
ఈ సీజన్‌లో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 25 వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. జిల్లాలో సాగయ్యే మొత్తం విస్తీర్ణంలో 90 శాతానికి పైగా వరి సాగు చేస్తారని ముందస్తుగానే అధికారుల అంచనాకు వచ్చారు. కోయిల్‌సాగర్‌లో నీరు పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాజెక్టు పరిధిలో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. చెరువులు, బోరుబావుల కింద కూడా వరి సాగును చేపడుతున్నారు. భూగర్భ జలమట్టాలు ఎక్కువగా ఉండటం వల్ల రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ క్వింటాలుకు రూ.500 ఇవ్వనుండటంతో ఎక్కువ మంది రైతులు యాసంగిలోనూ వాటినే సాగు చేస్తున్నారు. అలాగే వేరుశనగ 12,500 ఎకరాల్లో, మొక్కజొన్న 4 వేల ఎకరాల్లో సాగు చేశారు. వీటితో పాటు కూరగాయల పంటలను కూడా రైతులు వేశారు.
చెరువులు, బోరు, బావుల్లో
పుష్కలంగా నీరు
మరింత పెరిగిన విద్యుత్ డిమాండ్
జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో
వరి సాగు అంచనా
Comments
Please login to add a commentAdd a comment