చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
అడ్డాకుల: చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర అన్నారు. అడ్డాకులలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆమె చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలను పనిలో పెట్టుకుని శ్రమ దోపిడి చేయడం నేరమన్నారు. బాలబాలికలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. కళాశాలలో ర్యాగింగ్ చేయడం నేరమని, దానికి పాల్పడే వారికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారన్నారు. పోక్సో చట్టం, లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాల గురించి వివరించారు. తల్లిదండ్రులను గౌరవించి వారి ప్రతిష్ఠను పెంచేలా విద్యార్థులు ప్రవర్తించాలని సూచించారు. అలాగే మూసాపేట రైతువేదికలో పాఠశాల విద్యార్థులకు న్యాయమూర్తి చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment