సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో కొందరు అధికారులకు అవినీతి జబ్బు పట్టింది. ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూనే, లంచాల కోసం ఎగబడుతున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం జిల్లాలో మితిమీరుతున్న అవినీతికి అద్దం పడుతోంది. తాజాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. బెల్లంపల్లికి చెందిన డి.రాంసాగర్ సోదరి కారు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు నెలవారీ అద్దె ప్రతిపాదికన నడుస్తోంది. ఆరు నెలల అద్దె రూ.1.96 లక్షలు చెల్లించేందుకు అప్పటి సీనియర్ అసిస్టెంట్ షఫియొద్దీన్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.
ఇటీవలే ఆయన రామగుండం మెడికల్ కళాశాలకు బదిలీపై వెళ్లాడు. అయినా రాంసాగర్‌ను డబ్బుల కోసం ఫోన్‌చేసి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. లంచం డిమాండ్ చేసిన షఫియొద్దీన్, ఆయనకు డబ్బులు చేరవేయడంలో సహకరించిన అకౌంటెంట్ దీపిక, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజనర్సయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫిబ్రవరి 27న మంచిర్యాల వ్యవసాయ మార్కెట్‌కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ శారద, గద్దెరాగడికి చెందిన పత్తి వ్యాపారి విశ్వేశ్వర్ నుంచి రూ.65 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. పత్తి కొనుగోలు లైసెన్సు జారీ రిపోర్టు కోసం రూ.లక్ష డిమాండ్ చేసి, చివరకు రూ.80 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి, ఆమెను జైలుకు పంపాడు. గతంలోనూ జిల్లాలోని అధికారులు ఏసీబీకి పట్టుబడిన ఘటనలు ఉన్నాయి.
మారని అవినీతి అధికారుల తీరు..
జిల్లాలో ఇప్పటికీ చాలా శాఖల్లో లంచం ఇవ్వనిదే పని కావడం లేదు. సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్, సింగరేణి, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖ, విద్య, వైద్యం, ట్రెజరీ, పౌరసరఫరాల శాఖ, ఠాణాల్లో సైతం పైసలు ముట్టజెప్పందే ఫైలు కదలడం లేదు. దీంతో చాలా చోట్ల బాధితులు తమ పని కోసం ఎంతో కొంత ముట్టజెబుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో, పౌరులకు సేవలు అందించడంలోనూ కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాస్థాయి ఉద్యోగ నియామకాలు, ఔట్‌సోర్సింగ్ సేవలు, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం తదితర పనులకూ అధికారులు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. చాలాచోట్ల ఏసీబీ వరకు ఫిర్యాదులు వెళ్లకపోవడంతో అధికారుల్లో మార్పు రావడం లేదు.
ఏసీబీకి పట్టిస్తున్నారు
2021, జూలైలో బెల్లంపల్లి పట్టణ టౌన్ ఎస్సై, ఆయన డ్రైవర్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ బాధితుడి నుంచి రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
2019లో జన్నారం మండల రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఓ రైతు నుంచి రూ.3 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
2017లో ఓ మండలస్థాయి అధికారి కాంట్రాక్టరు నుంచి బిల్లుల్లో పర్సంటేజీ డిమాండ్ చేసి రూ.16 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
2017లో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్న మంచిర్యాల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం అధికారులపై కేసు నమోదు చేశారు.
2016లో మందమర్రి మండలం అందుగులపేట వీఆర్వో పట్టాపాస్ పుస్తకం జారీకి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
2015లో ఇద్దరు సాగు నీటి పారుదల అధి కారులు మిషన్ కాకతీయ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
లంచం అడిగితే ఫోన్ చేయండి
ఏసీబీ డీఎస్పీ: 9154388954
Comments
Please login to add a commentAdd a comment