మైత్రి ట్రాన్స్ క్లినిక్ ప్రారంభం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మంజూరు చేసిన మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను ట్రాన్స్‌జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా మైత్రి క్లినిక్‌ను ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవం, సమగ్ర వైద్యం అందించడంలో భాగంగా ప్రభుత్వం మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు. క్లినిక్‌లో ప్రత్యేక ఓపీలో డెర్మటాలజిస్ట్, సైకియాట్రిస్ట్ సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఆరోగ్య, ఆరోగ్యేతర సేవల్లో భాగంగా కౌన్సెలింగ్, లింగ అధారిత సేవలు, సాధారణ ఆరోగ్య సేవలు, లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స, ఇతర క్లినికల్ ల్యాబ్ సేవలను మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లో అందించనున్నట్లు వివరించారు. దీంతోపాటు జిల్లాలో అంబులెన్స్ సర్వీస్, పారామెడికల్ కోర్సులను సీఎం వర్చువల్‌గా ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రరెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూప, ఆర్‌ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ అనిత, డాక్టర్ సుధాకర్ నాయక్, దిశ ప్రోగ్రాం అధికారి నీలిమ, డెమో బుక్క వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ముస్తాఫా, డాక్టర్ నాయక్, హెల్త్ అసిస్టెంట్లు అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, వెంకటసాయి, పద్మ, ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment