సార్లు లేరు..!
● విద్యార్థులు ఎక్కువ.. ఉపాధ్యాయులు తక్కువ
● ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కొరత
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు నియామకంపై నిబంధనలు ఇవీ
విద్యార్థుల సంఖ్య టీచర్లు
1–10 1
11–60 2
61–90 3
91–120 4
121–150 5
151–200 6
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన, అభ్యసన ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. ఏటా కోట్లాది రూపాయలతో మ ధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా ఖాళీల భర్తీ విషయంలో స్పష్టత కొరవడుతోంది. ఏళ్ల తరబడి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ సెలవు దొరక్కుండా పోతోంది. సెలవు, సమావేశాలకు వెళ్లిన చోట్ల మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో సరిపెడుతుండగా.. మరికొన్ని చోట్ల మూసి వేయడమో, విద్యార్థులే చదువుకుని వెళ్లడమో చేస్తున్నారు.
ఇవీ సమస్యలు..
ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కరే ఉపాధ్యాయుడు బోధన చేస్తూ మిగతా పనులు చూసుకోవాల్సి వస్తోంది. నెలకో మారు సమావేశం, వృత్యంతర శిక్షణకు హాజరు కా వాలి. స్కూల్‌కాంప్లెక్స్ సమావేశాలు, ఆడిట్‌వర్క్, ఆన్‌లైన్ సేవలు సమయాల్లో సెలవు తీసుకోవాలి. ఉపాధ్యాయుడు అవసరాల నిమితం సెలవు తీసుకుంటారు. దీంతో ఆయా సమయాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసి వేయడమో, వేరే బడి నుంచి ఎంఈవో ఆదేశాల మేరకు మరొకరిని సర్దుబాటు చేయడమో చేస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత వల్ల తరగతులు అంతగా సాగడం లేదు. అందరికీ ఒకేచోట బోధిస్తే అర్థం చేసుకుని చదవడం కష్టంగా ఉంటోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విద్యావలంటీర్లను నియమించారు. తర్వాత కాలంలో విద్యావలంటీర్లను నియమించకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి.
జిల్లాలో..
జిల్లాలో 166 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్నింట్లో విద్యార్థుల సంఖ్య 10లోపు ఉండడంతో ఒకే టీచర్‌తో నెట్టుకొస్తున్నా రు. మరికొన్ని చోట్ల సర్దుబాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఒక్కరే బోధన సాగిస్తున్నారు. 23 పాఠశాలల్లో మంజూరైన 59 పోస్టుల్లో కూడా ఇంకా 19 టీచర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇంకోవైపు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా సింగల్ టీచర్‌తో నెట్టుకు వ స్తున్న పాఠశాలలూ ఉన్నాయి.
● నిర్మల్‌రోడ్ పాఠశాలలో 26 మంది విద్యార్థులు న్నారు. ఇద్దరు టీచర్లను నియమించాల్సి ఉన్నా పోస్టు మంజూరు లేక ఒక్కరే పనిచేస్తున్నారు.
● మన్నె కాలనీలో 31 మంది విద్యార్థులున్నారు. ఇద్దరు టీచర్లు పనిచేయాల్సిన చోట ఒక్కరు విధులు నిర్వర్తిస్తుండగా మరో పోస్టు ఖాళీగానే ఉంది.
● పాత మంచిర్యాలలో 36 మందికి ఒక్క టీచర్‌తోనే బోధన సాగుతోంది.
● అండాలమ్మకాలనీలో 19 మంది విద్యార్థులు న్నారు. రెండు పోస్టుల్లో ఒక్క ఉపాధ్యాయురాలి ని నియమించగా మరో టీచర్ పోస్టు ఖాళీగానే మిగిలిపోయింది.
● రంగపేట్ పాఠశాలలో 24 మంది విద్యార్థులు చదువుతుండగా సింగిల్ టీచర్‌తోనే బోధన సాగుతోంది.
● దొరగారిపల్లిలో 20 మంది విద్యార్థులున్నారు. రెండు టీచర్ల పోస్టుల్లో ఒక్క టీచర్ పాఠాలు బోధిస్తుండడంతో కష్టాలు తప్పడం లేదు.
● రాజీవ్‌నగర్(ఓల్డ్ గర్మిళ్ల) పాఠశాలలో 91 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకే పోస్టు మంజూరు ఉంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా మరో టీచర్‌ను నియమించకపోవడంతో ఇక్కడ వేరే పాఠశాల నుంచి వర్క్ అడ్జస్ట్‌మెంట్‌తో సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ప్రకారం మరో టీచర్ అవసరం.
ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని గోపాల్‌వాడ పాఠశాల. ఇందులో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 62మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా.. ఒకే టీచర్ విధులు నిర్వర్తిస్తున్నారు. తరగతి గదులు ఉన్నా టీచర్ల కొరతతో అన్ని తరగతులకు బోధించడం కష్టంగా మారుతోంది.
పక్కా భవనాలేవి..?
జిల్లా కేంద్రంలో పాఠశాలలకు పక్కా భవనాలు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. జీపీఎస్ ఇస్లాంపుర ఉర్దూ మీడియం పాఠశాల ఇరుకు అద్దె గదిలో కొనసాగుతోంది. 33 మంది విద్యార్థులున్నా ఒకే టీచర్ బోధన చేస్తున్నారు.
గోపాల్‌వాడ స్కూల్ సినిమావాడ స్కూల్‌లో రెండు తరగతి గదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు పక్కనే మరో ప్రభుత్వ భవనం ఖాళీగా ఉంది. అది కేటాయిస్తే సమస్య తీరిపోనుంది.
స్టేషన్‌రోడ్ పాఠశాలల్లో 72 మంది విద్యార్థులు అభ్యసిస్తుండగా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగిస్తున్నారు. పక్కనే జిల్లా సైన్స్ సెంటర్‌పైన(బాయ్స్ హైస్కూల్ తరగతి గదులు) స్పోర్ట్స్, వయోజన విద్యాశాఖ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయానికి తరలిపోవడంతో ఆ గదులు కేటాయిస్తే సరిపోతుంది. బాయ్స్ హైస్కూల్‌లోనే సైకిల్‌స్టాండ్ నిర్వహించే స్థలంలో గానీ, ఎస్సీ వసతి బాలుర కళాశాల పక్కన క్రీడా మైదానంలో పాఠశాల కోసం గదులు కేటాయిస్తే సమస్య తీరనుంది. హరిజనవాడ పాఠశాలలో రాళ్లపేట్ పాఠశాల నిర్వహిస్తున్నారు. బైపాస్‌రోడ్‌లోని ఎస్‌టీపీపీ స్థలం, లేదా విద్యార్థులకు అందుబాటులో పాఠశాల గదులు నిర్మించాలని కోరుతున్నారు. రంగపేట్ పాఠశాల భవనం పూర్తయినా పాత మంచిర్యాల హైస్కూల్‌లోనే కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment