అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
● రామగుండం సీపీ శ్రీనివాస్ ● వేమనపల్లిలో మెగా వైద్య శిబిరం
వేమనపల్లి: అసాంఘిక శక్తులైన మావోయిస్టులకు సహకరించొద్దని, ప్రజలు ప్రశాంత జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడపడమే పోలీసు ప్రధాన లక్ష్యమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని దస్నాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వేమనపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నీల్వాయి పోలీసులు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ ప్రజలకు భరోసా కేంద్రమని, ఆదివాసీల సంక్షేమం కోసం పోలీసు శాఖ నిరంతరం పని చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పల్లె నిద్ర కార్యక్రమాల్లో పోలీసు అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. మంచిర్యాల డ్రగ్గిస్ట్, కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) రాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్, టౌన్ సీఐలు సుధాకర్, రవీందర్, ఎస్సైలు శ్యాంపటేల్, రాజేందర్,శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్‌ఆలీ, డ్రగిస్ట్, కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఆశ్రమ స్థలాన్ని అప్పగించండి
ఆక్రమణకు గురైన వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల స్థలాన్ని పాఠశాలకు ఇప్పించాలని దస్నాపూర్, కొత్తపల్లి గ్రామాల యువత, మాజీ సర్పంచ్ రమేష్, నాయకులు వెంకటేష్‌గౌడ్, స్వామి సీపీకి వినతిపత్రం అందజేశారు. కొందరు వ్యక్తులు కబ్జా చేశారని తెలిపారు. దీంతో సమస్య పరిష్కరించాలని రూరల్ సీఐ సుధాకర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment