మొరం ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మొరం ట్రాక్టర్ల పట్టివేత

Published Thu, Jan 9 2025 12:51 AM | Last Updated on Thu, Jan 9 2025 12:51 AM

మొరం ట్రాక్టర్ల పట్టివేత

మొరం ట్రాక్టర్ల పట్టివేత

ఖానాపూర్‌: పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలో అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నామని తహసీల్దార్‌ శివరాజ్‌ తెలిపారు. పట్టుకున్న ట్రాక్టర్లను స్థానిక కార్యాలయానికి తరలించామని పేర్కొన్నారు.

నిందితుడికి జైలు

కడెం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన బానావత్‌ లక్ష్మణ్‌కు బుధవారం ఖానాపూర్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జితిన్‌కుమార్‌ 45రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2019 మార్చి 14న మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌ గ్రామ బస్టాప్‌ వద్ద బానావత్‌ లక్ష్మణ్‌ టాటా మ్యాజిక్‌తో బైక్‌ను డీకొట్టగా, బైక్‌పై ప్రయాణిస్తున్న మామడ మండలం పొన్కల్‌ గ్రామానికి చెందిన పందిరి రాజేశ్వర్‌ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు 2019లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం సాక్షులను ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్‌ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

చోరీ కేసుల్లో వ్యక్తికి..

దండేపల్లి: నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ రజాక్‌కు రెండు చోరీ కేసుల్లో లక్సెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి అసదుల్లా షరీఫ్‌ బుధవారం శిక్ష విధించారు. దండేపల్లి ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రజాక్‌ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది ఆగస్టు 22న దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన కాండ్రపు సరస్వతి ఇంటి తాళాలు పగులగొట్టి తులం బంగారు చైను, రూ.5వేల నగదు దొంగిలించాడు. సెప్టెంబర్‌ 27న దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన చుంచు సురేష్‌ ఇంట్లో పట్టపగలే రూ.20వేల నగదు అపహరించాడు. ఈ కేసుల్లో 3 నెలల 6 రోజులు, మరో కేసులో 2 నెలల 23 రోజుల శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.

ఒకరిపై కేసు

నర్సాపూర్‌ (జి): నిర్మల్‌ అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీ సర్‌ ఆదేశానుసారం ఆపరేషన్‌ స్మైల్‌–11లో భాగంగా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ మహేశ్‌, డీసీపీవో దేవి మురళి, ఎస్‌ఐపీ సాదిక్‌ హుస్సేన్‌ బుధవారం నర్సాపూర్‌ (జి) బస్టాండ్‌ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. శ్రీలక్ష్మి పానీపూరి బండి యజమాని శంకర్‌ వద్ద ఇద్దరు మైనర్‌ బాలురు పనిచేస్తూ వీరికి పట్టుబడ్డారు. జూనియర్‌ అసిస్టెంట్‌ మహేశ్‌ ఫిర్యాదు మేరకు పానీపూరి బండి యజమాని శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement