ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ స్తంభంపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం సీతాగోంది గ్రామానికి చెందిన పెందూర్ అరుణ్ (30) విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్ ప్రాంతంలో మంగళవారం కేబుల్ వైర్ కాలిపోవడంతో దాన్ని సరిచేస్తున్నాడు. ఈ క్రమంలో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఇన్వర్టర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై స్తంభం నుంచి కింద పడ్డాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇది వరకు అదే ప్రాంతంలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఇన్వర్టర్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా ఆ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరో నిండు ప్రాణం బలైందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహాన్‌ను వివరణ కోరగా మృతుడి కుటుంబానికి శాఖ తరఫున రూ.5లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment