బడిబయట పిల్లల గుర్తింపు
● ప్రారంభమైన సర్వే.. ● ఈనెల 25 వరకు నిర్వహణ
దండేపల్లి: సమగ్రశిక్ష ఉద్యోగులు మొన్నటి వరకు సమ్మెలో ఉండటంతో బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే నిలిచిపోయింది. డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. దీంతో బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే కోసం సమగ్రశిక్షా అభియాన్ పరిధిలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)లను విద్యాశాఖ రంగంలోకి దింపింది. 6–14 ఏళ్ల లోపు, 15–19 ఏళ్లలోపువారు చదువుకోకపోవడానికి కారణాలను ఆరా తీస్తున్నారు.
25 వరకు సర్వే..
బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు 33 అంశాలతో కూడిన సర్వే పత్రంతో సీఆర్పీలు, ఐఈఆర్పీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈనెల 16 నుంచి మొదలైన సర్వే ఈనెల 25తో ముగియనుంది. సర్వేలో ముఖ్యంగా రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తున్నారు. బడీడు ఉండి బడిలో చేరనివారిని గుర్తించడం, పాఠశాలలో చేరి 30 రోజులు గైర్హాజరై డ్రాపవుట్ అయిన వారిని గుర్తించి మళ్లీ పాఠశాలలో చేర్పించడంపై ప్రత్యేక దృష్టిసారించారు. క్లస్టర్ రిసోర్స్పర్సన్లు విద్యార్థి, తల్లిదండ్రులు, ఆధార్‌సంఖ్య, చిరునామా, మాతృభాష, చదువుకు దూరం కావడానికి కారణాలు సర్వే పత్రంలో నమోదు చేస్తున్నారు. సర్వే పత్రంలో అన్నీ అంశాలను నమోదు చేయాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. కోళ్లఫారాలు, ఇటుక బట్టీల వద్ద, కూలీలు ఎక్కువగా ఉండే చోట వారి పిల్లలను ప్రస్తుతం ఏ విధంగా ఉంచారో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలను..
బడిబయటి పిల్లలతో పాటుగా ప్రత్యేక అవసరాల పిల్లలను సైతం గుర్తించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. వ్యక్తిగతంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీయ నున్నారు. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ నేపథ్యం తదితర వివరాలను నివేదికలో పొందుపరచనున్నారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్‌చదువులకు దూరంగా ఉన్నవారిని గుర్తించేందుకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి వివిధ కోణాల్లో సిబ్బంది వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
సమ్మె కారణంగా ఆలస్యం..
బడిబయటి పిల్లల గుర్తింపు సర్వేను ఏటా డిసెంబర్–జనవరి మధ్యలో నిర్వహిస్తాం. ఈసారి సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో సర్వే కొంత ఆలస్యంగా ఈనెల 16 నుంచి మొదలైంది. 25 వరకు పూర్తిచేస్తాం. బడిబయటి పిల్లలను గుర్తించి వారందరికీ చదువు అందించడమే విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం.
– సత్యనారాయణమూర్తి, జిల్లా సెక్టోరియల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment