కోళ్లు చనిపోతున్నాయ్...!
● ఆర్‌డీ వైరస్ బారిన పడుతున్న వైనం ● పశువైద్యశాలల్లో అందుబాటులో లేని వ్యాక్సిన్
భైంసాటౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు అకస్మాత్తుగా చనిపోతున్నాయి. అప్పటివరకు బాగానే ఉన్నా ఒక్కసారిగా మృత్యువాత పడుతున్నాయి. దీంతో కారణం తెలియక పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక శాస్త్రినగర్‌లో వారంరోజుల్లో 20కి పైగా కోళ్లు చనిపోయాయి. ఈ విషయమై ‘సాక్షి’ స్థానిక పశువైద్యుడు విఠల్‌ను ఫోన్‌లో సంప్రదించగా కోళ్లకు ఈ సీజన్‌లో ఆర్‌డీ (రానికేట్ డిసీజ్) వైరస్ సోకుతుందని, ఈ కారణంగానే మృత్యువాత పడుతున్నాయన్నారు. ఏటా వర్షాకాలం–చలికాలం, చలికాలం–వేసవికి మధ్య రెండుసార్లు కోళ్లు ఈ వైరస్ బారిన పడుతాయన్నారు. వ్యాధి నియంత్రణ కోసం పెంపకందారులు ముందస్తుగా వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుందన్నారు. కానీ కొంతకాలంగా పశు వైద్యశాలలకు ఆర్‌డీ వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ప్రైవేటులోనూ అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం పశువైద్యశాలలకు ఆర్‌డీ వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోళ్ల పెంపకందారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment