సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) సకాలంలో ఇవ్వని రైస్‌మిల్లర్లపై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో కొందరు మిల్లర్లు ఆయా సీజన్లలో సర్కారు నుంచి ధాన్యం తీసుకోవడమే గానీ, గడువులోపు బియ్యం అప్పగించకపోవడంతో చివరగా కఠిన చర్యలు చేపడుతున్నారు. సకాలంలో ఇవ్వని మిల్లర్ల బకాయిలు, జరిమానాలు, తదితరలు కలుపుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 133. 78కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ మొ త్తంలో మిల్లర్లు అత్యధికంగా రూ.19కోట్ల నుంచి మొదలు కనీసం రూ.3కోట్ల దాక బకాయిదారులు ఉన్నారు. దీంతో ఆయా బకాయిలు ఉన్న వారందరిపైనా మొదట ఆర్‌ఆర్ యాక్టు(రెవెన్యూ రికవరీ చట్టం) ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. అ యినప్పటికీ స్పందించని వారిపై పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెడుతున్నారు. కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 20మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. గతేడాది మేలో మొదటగా ఓ మిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు మొత్తం 14మంది మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్టుతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరో నలుగురిపై ఆర్‌ఆర్ యాక్టు, మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు మిల్లర్లు ఇప్పటికే శతావిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బకాయిలు రాబట్టేందుకు ఆర్‌ఆర్ చట్టం ప్రకారం కేసులు ఎదుర్కొంటున్నవారి ఆస్తుల గుర్తింపు జరుగుతోంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం సర్కారుకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment