పదికి ప్రత్యేక బోధన
58 రోజుల యాక్షన్ ప్లాన్ వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం జిల్లాలో 146 ఉన్నత పాఠశాలలు
● పాపన్నపేట ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న ప్రత్యేక క్లాసులు
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పదో తరగతి ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి. వచ్చే మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ అధికారులు 58 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ప్రతి రోజు సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 వరకు (గంట పాటు) నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. గతేడాది 92.90 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 18వ స్థానంలో నిలిచింది.
– పాపన్నపేట(మెదక్)
మెదక్ జిల్లాలో మొత్తం 146 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. బాలురు 5,366 మంది, బాలికలు 5,549 కలిపి మొత్తం 10,915 విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వచ్చే మార్చిలో జరగనున్న పరీక్షలకు సంబంధించి ఈనెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 11 వరకు 58 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ సమయంలో సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రారంభించాలని సూచించారు. మొదటి రోజు సాంఘీకశాస్త్రం, రెండో రోజు హిందీ, మూడో రోజు గణితం, నాలుగోరోజు ఆంగ్లం, ఐదో రోజు ఫిజికల్ సైన్స్, ఆరో రోజు సోషల్, ఏడో రోజు బయోలజీ సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు నిర్వహించిన ప్రత్యేక తరగతుల రికార్డు అందుబాటులో ఉంచాలి. సంబంధిత ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలి. స్పెషల్ క్లాసులను ఆరుబయట కాకుండా తరగతి గదిలోనే నిర్వహించాలి. సిలబస్ పూర్తి కాగానే రివిజన్ చేయాలని అధికారులు ఆదేశించారు.
మెరుగైన ఫలితాల కోసమే..
గతేడాది మార్చిలో జిల్లా నుంచి 10,283 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 9,553 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 18వ స్థానంలో నిలిచింది. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. స్నాక్స్ అందించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు.
– రాధాకిషన్, డీఈఓ మెదక్
స్నాక్స్ ఇవ్వండి సారు
మిన్‌పూర్ నుంచి ఉదయం 8.30 గంటలకు కుర్తివాడ ఉన్నత పాఠశాలకు కాలినడకన బయలు దేరుతాం.స్సెషల్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే సరికి సాయంత్రం ఆరు అవుతుంది. రోజు ఆరు కిలోమీటర్లు నడవాలి. దీంతో సాయంత్రం పూట ఆకలి అవుతుంది. విద్యాశాఖ అధికారులు పది విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇచ్చి ఆకలి బాధ తీర్చాలి.
– జంగం వర్ష, పదో తరగతి,
కుర్తివాడ ఉన్నత పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment