నిఘా నేత్రాలు.. నిరంతర పర్యవేక్షణ
● సమర్థవంతమైన పాలనకు సమూల మార్పులు ● ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరా ఏర్పాటు
● మెదక్ సమీకృత కలెక్టరేట్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా... కొందరిలో మార్పు రావడం లేదు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లాలో అధికారుల పాలనపై సమూల మార్పులు తెచ్చేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులతో పాటు కలెక్టరేట్‌లోని ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.
160 సీసీ కెమెరాలు
కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏకంగా 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో సర్వేలైన్స్ కంట్రోల్ రూం సిద్ధం చేశారు. కలెక్టర్ తన ఛాంబర్ నుంచి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ఏ ఒక్క అధికారి విధుల్లో అలసత్వం వహించిన సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
ఆ అధికారులు ఇంటికే...
అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన లేకుండా కార్యాలయానికి వస్తామంటే కుదరదు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాల్సిందే. లేదంటే నిఘా నేత్రాలు గుట్టును రట్టు చేస్తాయి. దీంతో అలాంటి అధికారులపై కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టనున్నారు. అలాగే కలెక్టరేట్‌లో ప్రతి కదిలిక సీసీటీవీ సర్వేలైన్స్‌లో ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో అధికారులు, సిబ్బంది పనితీరు సైతం అంచనా వేయవచ్చు. అలాగే కార్యాలయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పగడ్బందీ చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది.
ఇప్పటికే ఈ– ఆఫీస్ విధానం
ఇప్పటికే కలెక్టరేట్‌లోని అన్నిశాఖల అధికారులు తమ ఫైళ్లను కేవలం ఈ– ఆఫీస్ విధానం ద్వారానే పంపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ–ఆఫీస్ విధానం ద్వారానే ఫైళ్లను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో దాదాపు 40కిపైగా శాఖల్లో జిల్లా అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కొన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు పలు పనుల మీద వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారుల పనితీరుపై పక్కాగా పర్యవేక్షణ ఉండేలా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment