ప్రతీ గింజను కొంటాం
● ఉమ్మడి మెదక్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ హరిచందన
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ హరిచందన అన్నారు. సోమవారం రాత్రి ఆర్డీఓ కార్యాలయంలో మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టి తీసుకురావాలని సూచించారు. తూకం వేసే పనులు వేగవంతం చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైతే రైతులు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను కేటాయించామన్నారు. తూకం వేయగానే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి, ఆర్‌డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ, సివిల్ సప్‌లై శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి మండలంలోని నాగ్సాన్‌పల్లి వద్ద డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా తేమశాతం పరిశీలించి రైతులతో మాట్లాడారు. నాణ్యమైన ధాన్యం సేకరించాలని నిర్వాహకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment