దేశానికే ఆదర్శం బీసీ కులగణన
పటాన్‌చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే–బీసీ కులగణన దేశానికే ఆదర్శమని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. పటాన్‌చెరు మండల్ చిట్కుల్‌లో బుధవారం ఇంటింటి కుటుంబ సర్వేను కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్‌తో కలసి మంత్రి ప్రారంభించారు. ముందుగా చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టింద న్నారు. ఈ సర్వేతో కులాల వారీగా బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరుగుతుందని వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయంగా అవకాశాలు పెరిగేందుకు ఈ కులగణన ఉపయోగపడుతుందని తెలిపారు.
బ్రిటిష్ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడే...
బ్రిటిష్ కాలంలో జరిగిన కులగణన తర్వాత దేశంలో మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సర్వే చేపట్టామని వివరించారు. ఈ సర్వేకోసం రాష్ట్రవ్యాప్తంగా 85 వేలకు మంది పైగా ఎన్యూమరేటర్లను నియమించామన్నారు. ఒక్కొక్క కుటుంబ సర్వే పూర్తి చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుందని తెలిపారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తిగా సహకరించి సమగ్ర వివరాలను అందించాలని కోరారు. మన కుటుంబాల ఆర్థిక స్థితిగతుల వివరాల్ని ప్రభుత్వానికి అందజేసేందుకు కష్టపడుతున్న సిబ్బందికి కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ... సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో బీసీ కులాల లెక్క తేలుతుందన్నారు. ఈ సర్వేతో ప్రజల ఆర్థిక స్థితిగతులపై అంచనాకు వచ్చి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి వీలు పడుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ,మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీపీఓ శ్రీధర్ రావు, పటాన్‌చెరు తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, ఎంపీవో హరి శంకర్ గౌడ్, చిట్కుల్ ఈఓ కవిత త దితరులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
చిట్కుల్‌లో అట్టహాసంగాప్రారంభమైన సర్వే
Comments
Please login to add a commentAdd a comment