నిమ్జ్‌కు హుందాయ్
407 ఎకరాల్లో ఏర్పాటు
● పరిశ్రమ ఏర్పాటుకుభూసార పరీక్షలు ● ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి
సంగారెడ్డి జోన్: నిమ్జ్‌లో మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే అక్కడ వేమ్ టెక్నాలజీ ప రిశ్రమ ఏర్పాటు పనులు కొనసాగుతుండగా.. మరో భారీ పరిశ్రమ హుందాయ్ ఏర్పాటుకు భూములను కేటాయించారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో సుమా రు 12 వేలకు పైగా ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటికే మొదటి విడత పూర్తికాగా రెండో విడతలో భూసేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 6,000 ఎకరాల భూసేకరణ పూర్తి అయింది.
2,100 కోట్ల మేర పెట్టుబడులు
నిమ్జ్‌లో ఏర్పాటుకానున్న హుందాయ్ పరిశ్రమలో వాహనాల టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ. 2,100 కోట్ల మేర పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో వందల సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగనుంది. ఇప్పటికే నిమ్జ్‌లో వేమ్ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పరిశ్రమ 511 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్నారు. తొలిదశలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టను న్నారు. దీంతో సుమారు 1,000 మందికిపైగా ఉపాధి లభించనుంది. పరిశ్రమ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే పరిశ్రమ ప్రతినిధులతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ వల్లూరు క్రాంతితో సమావేశం నిర్వహించారు.
పూర్తికావొచ్చిన రహదారి పనులు
నిమ్జ్ ప్రాంతాన్ని, జాతీయరహదారి 65కు అనుసంధానం చేస్తూ జహీరాబాద్ మండలం హుగ్గెళ్లి నుంచి ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ వరకు 9.5 కిలోమీటర్ల పొడవునా రహదారిని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం తుదిదశలో ఉంది. రహదారి నిర్మాణానికి రూ.1,000 కోట్ల నిధులతో పనులు చేపట్టిన సంగతి తెలిసిందే.
కొనసాగుతున్న మట్టి పరీక్షలు
ప్రముఖ హుందాయ్ పరిశ్రమ సుమా రు 407 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామ శివారులో పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయించారు. పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూములలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమ టెక్నికల్ బృందం సభ్యులు సుమారు 50 పాయింట్లలో 20 మీటర్ల మేర లోతులో డ్రిల్ మిషన్ సహాయంతో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మట్టి నమూనాలు, పరీక్షలు పూర్తి కాగానే, పరిశ్రమ శంకుస్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం.
మట్టి నమూనాలు సేకరిస్తున్న
టెక్నికల్ బృందం
Comments
Please login to add a commentAdd a comment