ఆర్టీసీ స్పెషల్ బాదుడు
● పండుగ, వరుస సెలవులే కారణం ● 50 శాతం అదనపు చార్జి ● ప్రయాణికులకు తప్పని భారం
క్రిస్మస్ పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అదనపు చార్జి చెల్లించారు. మాములు రోజులతో పోలిస్తే 50 శాతం ఎక్కువే. ఇలాంటి సందర్భాల్లో ప్రజల సౌకర్యార్థం అదనపు బస్సులను ఏర్పాటు నడిపించాలే గానీ ఎక్స్‌ట్రా చార్జి వసూలు చేయడమేంటని పలువురు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు.
సిద్దిపేటకమాన్: సాధారణ రోజుల్లో సిద్దిపేట నుంచి రామాయంపేటకు ఆర్డీనరి, పల్లె వెలుగు బస్సులో ప్రయాణికుడి నుంచి రూ.60 చార్జి వసూలు చేస్తారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఉందని బుధవారం ప్రయాణికుల నుంచి సిద్దిపేట నుంచి రామాయంపేటకు ప్రయాణికుడి నుంచి రూ.80 (అదనంగా రూ.20లు) వసూలు చేశారు. సిద్దిపేట నుంచి తోర్నాలకు సాధారణ రోజుల్లో రూ.20 చార్జి. పండుగ నేపథ్యంలో వృద్ధుడి నుంచి రూ.30 (అదనంగా రూ.10లు) వసూలు చేశారు. సిద్దిపేట నుంచి జేబీఎస్, గజ్వేల్, రామాయంపేట, మెదక్‌తో పాటు అన్ని రూట్లలో పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేశారు. అదనపు చార్జి ఎందుకు వసూలు చేస్తున్నారంటూ కొన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కండక్టర్లను నిలదీశారు. దీంతో వాగ్వాదాలు జరిగాయి.
మెదక్ రూట్‌లో 50 శాతం ..
సిద్దిపేట నుంచి మెదక్ వరకు సాధారణ రోజుల్లో కంటే బుధవారం 50 శాతం అధిక చార్జి వసూలు చేశారు. ఈ రూట్‌లో మాములు చార్జి రూ.100లు కాగా క్రిస్మస్ పండుగ నేపథ్యంలో బుధవారం ప్రయాణికుడి నుంచి 50 శాతం అధికంగా రూ.150(అదనంగా రూ. 50లు) వసూలు చేశారు. సిద్దిపేట డిపో నుంచి మెదక్‌కు సాధారణ రోజుల్లో రోజూ 6 బస్సులు 21 ట్రిప్పులు నడుపుతాయి. క్రిస్మస్ రోజు 7 అదనపు బస్సులను ఏర్పాటు చేసి 18 అదనపు బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సులు ఖాళీగా వచ్చే అవకాశం ఉండడంతో నష్టాన్ని తగ్గించుకోవడానికి 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయవచ్చని డిఫో మేనేజర్ తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment