అట్టహాసంగా రైతు సమ్మేళనం
హాజరైన ఉప రాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖడ్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రి కొండాసురేఖ
నర్సాపూర్/కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలం తునికి వద్ద గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు రైతు సమ్మేళనం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి డాక్టర్ సుదేశీధన్‌కడ్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రత్యేక హెలికాప్టర్‌లో కేవీకేకు చేరుకోగా మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. బ్యాటరీ వాహనంలో భారీ బందోబస్తు మధ్య సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడ ఉపరాష్ట్రపతి మామిడి మొక్కనాటారు. అనంతరం సేంద్రియ ఉత్పత్తులు, ఎరువులు, జీవామృతం, వివిధ కషాయాల స్టాల్స్‌ను పరిశీలించారు. అక్కడే మహిళా రైతులు గిరిజన సాంప్రదాయ నృత్యం చేయగా ఉపరాష్ట్రపతి వారితో కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచారు. అనంతరం కేవీకే శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సేంద్రియ, ప్రకృతి సాగు గురించి తెలుసుకొని అభినందించారు. ఈసందర్భంగా అఖిల భారత కార్యకరని సదస్య బాగయ్య మాట్లాడుతూ.. కేవీకే ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 650 మంది రైతులు సేంద్రియ, ప్రకృతి సాగు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ పీవీ రావు, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సినీ నిర్మాత సురేష్‌బాబు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గోపి, అటారీ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎన్ మీర, నామ్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ మూర్తి, ఏపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సత్యవతి, ఐఐఓఆర్ డైరెక్టర్ ఆర్‌కే మాథుర్ వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా కేవీకేలో ఉపరాష్ట్రపతి, గవర్నర్ పర్యటన గంట 45 నిమిషాల పాటు సాగింది. 25 నిమిషాల పాటు ఉపరాష్ట్రపతి మాట్లాడారు. సాయంత్రం 4.15 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యారు. కేవీకేలో రైతు సమ్మేళనం అట్టహాసంగా ముగియడంతో అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment