మల్లన్న సాగర్.. వాటర్ హబ్
ఇప్పటికే నాలుగు జిల్లాలకు తాగునీరు
● ఏప్రిల్ వరకు మరో 1,160 ఆవాసాలకు.. ● నగరానికి 20 టీఎంసీల నీరుతరలింపునకు ప్రణాళికలు
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నసాగర్ సాగు, తాగు నీటిని అందిస్తూ వాటర్ హబ్‌గా నిలుస్తోంది. ఇప్పటికే నాలుగు జిల్లాలోని 22 మండలాలకు తాగునీటిని అందిస్తుండగా, ఈ ఏడాది ఏప్రిల్ వరకు మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాలోని 1,160 ఆవాసాలకు సైతం నీటిని అందించనుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఇక్కడి నుంచే 20 టీఎంసీల నీటిని తరలించాలని ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రణాళికలను సైతం రూపొందిస్తున్నారు. తొగుట, కొండపాక మండల పరిధిలో 50టీఎంసీల సామర్థ్యంతో కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను ఫిబ్రవరి 2022లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద ఆరు మోటార్ల ద్వారా 5.6కిలో మీటర్ల పైప్‌లైన్‌తో మంగోల్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు మొదట నీటిని చేరుస్తున్నారు. అక్కడ 270 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామర్థ్యంతో రెండు ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించగా ఒక దాని నుంచి శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నారు. జూన్ 2023 నుంచి స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి, సిద్దిపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు శుద్ధిచేసిన గోదావరి జలాలను అందిస్తున్నారు. ఈ నియోజకవర్గాలలో 22 మండలాల్లోని 870 ఆవాసాల్లో 2.10లక్షల నల్లా కనెక్షన్లకు తాగునీటిని రోజుకు 170 ఎంఎల్ (మిలియన్ లీటర్లు ఫర్ డే) పంపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకు ఆలేరు, భువనగిరి, దుబ్బాక, గజ్వేల్, మేడ్చల్, నర్సాపూర్, నకిరేకల్ నియోజకవర్గాలోని 1,160 ఆవాసాలకు 3.03లక్షల నల్లాల ద్వారా తాగునీటిని అందించనున్నారు.
నీటిని తరలించేందుకు ప్రణాళికలు..
మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అందులో హైదరాబాద్ తాగునీటి కోసం 15 టీఎంసీల నీటిని, మరో ఐదు టీఎంసీలు మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ తరలించనున్నారు. తిప్పారం నుంచి నేరుగా మేడ్చల్ జిల్లాలోని ఘన్‌పూర్‌కు రా వాటర్‌ను తరలించే అవకాశఽం ఉంది. ఘన్‌పూర్ కొండ కింద ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను.. కొండమీది నుంచి పంపింగ్ పాయింట్ ద్వారా శుద్ధిచేసిన నీటిని హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఇందుకోసం రూ.7,360 కోట్ల నిధులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు తాగునీటిని అందించేందుకు డీపీఆర్ సిద్ధంచేస్తున్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా..
హైదరాబాద్‌లో రోజురోజుకు జనాభా పెరుగుతుండటంతో వారి అవసరాలకు సరిపడే విధంగా భవిష్యత్తులో తాగునీటి కొరత ఉండవద్దనే ఉద్దేశ్యంతో మల్లన్నసాగర్ నుంచి నీటిని ప్రభుత్వం తరలిస్తోంది. నగరంలో సుమారు 14 లక్షలకు తాగునీటి కనెక్షన్లు ఉండగా రోజు 565 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే) నీటిని సుమారుగా 25టీఎంసీల నీటిని అందిస్తున్నారు. అయితే 2050 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనంగా నీటి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment