ఎకరాకు రూ.80 లక్షలు చెల్లించాలి
ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులు
నర్సాపూర్ రూరల్: ఎకరాకు రూ. 80 లక్షల పరిహారం చెల్లించాలని ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులు అధికారులను కోరారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్ పరిహారం చెల్లింపుపై రైతులతో చర్చించారు. ఎకరాకు రూ. 42 లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ.. గతంలో కాళేశ్వరం కాలువ ఏర్పాటు కోసం సుమారు 180 ఎకరాల వ్యవసాయ భూములు కోల్పోయామని, అతి తక్కువ పరిహారం రూ. 12 లక్షలు చెల్లించడంతో తీవ్రంగా నష్టపోయినట్లు గుర్తుచేశారు. దీనికి తోడు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ లైన్‌తో మరింత నష్టం జరుగుతుందని అధికారులతో మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఆర్ కోసం 34 ఎకరాలు కోల్పోతున్నామని వివరించారు. రెడ్డిపల్లి భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఎకరాకు రూ. 80 లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో రెడ్డిపల్లి భూ నిర్వాసితులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment