పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం)/మంగపేట: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన రామప్ప, హేమాచల క్షేత్రంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సెలవులు రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. వెంకటాపురం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓంకారం అలంకరణలో పర్యాటకులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్‌లు ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు వివరించారు. పర్యాటకులు అధికసంఖ్యలో తరలిరావడంతో రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. పోలీసులు క్యూలో భక్తులను పంపిస్తూ చర్యలు తీసుకున్నారు. అదే విధంగా మంగపేట మండలంలోని మల్లూరు గుట్టపై గల శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణంలో భక్త జనసందడి నెలకొంది, ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న స్వామివారి ప్రధానాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి రెండు గంటల పాటు తిల తైలాభిషేకం పూజా కార్యక్రమాలను నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలతో అలంకరింపజేశారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment