ఎండలోనే ఉపాధి | Sakshi
Sakshi News home page

ఎండలోనే ఉపాధి

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

టెంట్లు లేక ఇబ్బందులు

ఎదుర్కొంటున్న కూలీలు

గ్రామ పంచాయతీల

ద్వారా ఏర్పాట్లు..

జిల్లాలోని ఉపాధి కూలీలకు ఆయా గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో తాగునీరు, నీడ వసతి కల్పించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు సైతం ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిప్రదేశాల్లో కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– చిన్న ఓబులేసు,

జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: వేసవి నేపథ్యంలో వ్యవసాయ పనులు లేక జిల్లా వ్యాప్తంగా కూలీలకు ఉపాధి సన్నగిల్లింది. దీంతో ప్రధానంగా ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పథకంపైనే పెద్ద సంఖ్యలో కూలీలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు 20 వేల లోపు మాత్రమే కూలీలు హాజరయ్యే పరిస్థితి ఉండగా.. వేసవిలో మాత్రం గత మంగళవారం ఒక్కరోజునే జిల్లా వ్యాప్తంగా 45,597 మంది ఉపాధి కూలీలు హాజరయ్యారు. రానున్న వారం రోజుల్లో ఉపాధి హామీ పనులను ఆశ్రయించే వారి సంఖ్య మరింత పెరుగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కీలకంగా మారిన ఉపాధి హామీ పనుల్లో చాలాచోట్ల కనీస సౌకర్యాలు కూడా కరువవడంతో ఉపాధి కూలీలకు ఎండదెబ్బ తప్పడం లేదు.

సౌకర్యాలు కరువు..

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే పగటి ఉష్టోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోవడంతో ఎండలో పనిచేసే కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల కూలీలకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కరువైంది. కూలీలు సొంతంగా తెచ్చుకున్న నీళ్ల బాటిళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మండుటెండలో పనిచేసే కూలీలకు వడదెబ్బ తగలకుండా, విశ్రాంతి కోసం టెంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా అలాంటి ఏర్పాట్లు కన్పించడం లేదు.

స్పందించని అధికారులు..

ఉపాధి హామీ పథకం కింద పని కల్పించే ప్రదేశాల్లో ఆయా గ్రామపంచాయతీల ద్వారా తాగునీటి ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కూలీకి కనీసం రెండు లీటర్ల చొప్పున పంచాయతీలే సురక్షిత తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అయితే జిల్లాలో చాలాచోట్ల గ్రామపంచాయతీల అధికారులు, సిబ్బంది కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించడం లేదు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి పెరుగుతుండటంతో ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీరు, టెంటు సౌకర్యాలను కల్పించాలని, వేతనాలను వెంటనే అందజేయాలని కోరుతున్నారు.

జాబ్‌కార్డుల సంఖ్య 1,91,767

ఈ ఏడాదిలో పనికల్పించిన కూలీల సంఖ్య 1,73,064 మంది

పని ప్రదేశాల్లో కరువైన సౌకర్యాలు

నీడ, తాగునీటి ఏర్పాట్లకు కదలని

పంచాయతీ యంత్రాంగం

జిల్లా వ్యాప్తంగా నిత్యం 45 వేలకు పైగా కూలీల హాజరు

ఏజెన్సీల్లో అమలుకాని ‘ప్రత్యేక’ ప్యాకేజీ

జిల్లాలోని నల్లమల పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాలు, చెంచుపెంటల్లోని చెంచులకు ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారానే ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు గతంలో ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి అదనపు వేతనం, భత్యం చెల్లించేది. ఇప్పుడు అదనపు చెల్లింపులు నిలిచిపోవడంతో పాటు పదిహేను రోజుల్లోగా అందాల్సిన వేతనం సైతం మరింత ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని చెంచులకు నిరంతరం పని కల్పించడంతో పాటు వేతనం సైతం త్వరగా అందించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement