ఉత్తీర్ణత శాతం పెంచాలి
అమ్రాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను అన్నివిధాలా సిద్ధంచేసి, ఉత్తీర్ణత శాతం పెంచాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి జి.వెంకటరమణ అన్నారు. అమ్రాబా ద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హజరు శాతాన్ని పరిశీలించారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధత గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యే విధంగా చూడాలని అధ్యాపకులకు సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ప్రభువర్ధన్‌రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.
డీఈఓగా రమేష్‌కుమార్
నాగర్‌కర్నూల్: జిల్లా విద్యాశాఖ అధికారిగా రమేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకటనరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేస్తున్న డీఈఓ గోవిందరాజులును నారాయణపేటకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాజన్న సిరిసిల్ల డీఈఓగా పనిచేస్తున్న రమేష్ కుమార్‌ను నాగర్‌కర్నూల్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఈఓ గోవిందరాజులు 2019 ఫిబ్రవరి 6 నుంచి సుదీర్ఘ కాలంపాటు జిల్లాలో సేవలందించారు.
హామీల అమలులో విఫలం
నాగర్‌కర్నూల్‌రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు ఏకమై ప్రభుత్వంపై తిరగబడకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులకు మద్యమే మార్గంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నిర్మల, పద్మ, ఆదిలక్ష్మి, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, చెన్నమ్మ, నాగలక్ష్మి ఉన్నారు.
సాయిరెడ్డి ఆత్మహత్యకు సీఎం సోదరులే కారణం
కల్వకుర్తి టౌన్: వంగూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన సాయిరెడ్డి ఆత్మహత్యకు ముఖ్యమంత్రి సోదరులే కారణమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సాయిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన సీఎం సోదరులపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే పార్టీ తరఫున పోరాడతామన్నా రు. మృతుడి కుటుంబ సభ్యులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చా రు. కాగా, కల్వకుర్తి సీఐ నాగార్జున మాట్లాడుతూ.. సాయిరెడ్డి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేశామని, మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. మృతుడి చిన్నకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వమే పత్తి కొనాలి
నాగర్‌కర్నూల్ రూరల్: వానాకాలంలో పండించిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశమోని ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక లక్ష్మణాచారి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి రంగు మారిందని.. కాయ ఉందని వ్యాపారులు సాకులు చెబుతూ రైతులను దగా చేస్తున్నారన్నారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, క్వింటాల్ రూ. 10వేలకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కపిలవాయి గోపిచారి, వాడాల బాలపీర్, విజయ్, నవీన్, రాము ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment