డిజిటల్ కార్డు సర్వే ప్రారంభం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన కుటుంబ డిజిటల్ సర్వే గురువారం ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధార్‌కార్డు తరహాలో ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలోని ఒక మున్సిపాలిటీ, ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. జిల్లాలో ఆరు నియోజక వర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. 150 గృహాలకు ఒక బృందం చొప్పున సర్వే కోసం ఎంపిక చేశారు. గ్రామాల్లో రెండు బృందాలను ఏర్పాటు చేయగా పట్టణాల్లో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి ఎంపీడీఓ బాధ్యత వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో సర్వే చేస్తున్న బృందాలకు కమిషనర్ నాయకత్వం వహిస్తున్నారు. మొదటి రోజు కట్టంగూర్‌లో జరిగిన కుటుంబసర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. మిగిలిన చోట్ల ఆర్డీఓలు పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కుటుంబ డిజిటల్ కార్డు సర్వే నిర్వహిస్తున్నందున ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సర్వే నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులందరితో ఫొటో తీస్తు ప్రభుత్వం పంపిన ఫార్మాట్ ప్రకారం దరఖాస్తులను ఆధార్‌కార్డుల ఆధారంగా నింపుతున్నారు.
ఫ ఒక్కో గ్రామంలో 2 బృందాల సర్వే
ఫ 150 కుటుంబాలకు ఒక బృందం
సమర్థవంతంగా నిర్వహించాలి
ఫ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్
నకిరేకల్, కట్టంగూర్: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ అన్నారు. నకిరేకల్‌లోని 9వ వార్డులో చేపట్టిన డిజటల్ కార్డు సర్వేను గురువారం అమె పరిశీలించారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని సందర్శించాలని సూచించారు. ఆమె వెంట జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్‌రెడ్డి, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాలయ్య ఉన్నారు. అదేవిధంగా కట్టంగూర్ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చేపట్టిన డిజిటల్ కార్డు సర్వేను పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. రామచంద్రాపురం గ్రామంలో 217 కుటుంబాలు ఉండగా రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసి సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ చలపతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment