నేటి నుంచి అనధికారికంగా ఒంటిపూట బడి
నల్లగొండ : ప్రభుత్వం బుధవారం నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను చేపట్టనుంది. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఎస్‌జీటీలను సర్వేకు వినియోగిస్తోంది. వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు బోధించి.. మధ్యాహ్నం తర్వాత గ్రామాల్లో సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ సర్వే జరగనుంది. ఎస్‌జీటీలంతా సర్వేలో పాల్గొంటుండడంతో ఉదయం వరకే పాఠశాలల్లో బోధన జరగనుంది. దీంతో ఈ నెల 18వ తేదీ వరకు అనధికారికంగా ఒంటిపూట బడులు సాగునున్నాయి.
పోలీస్ కుటుంబానికి ఆర్థిక భరోసా
నల్లగొండ క్రైం : పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కుటుంబాలకు శాఖపరంగా అండగా ఉంటామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ రతన్‌లాల్ కుమారుడు వంశీకి మంగళవారం రూ.2 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. శాఖాపరంగా రావల్సిన సౌకర్యాలను త్వరగా అందజేస్తామని తెలిపారు.
సెల్‌ఫోన్ల రికవరీలో ఎస్‌ఐకి అవార్డు
నల్లగొండ క్రైం : మిస్సింగ్ అయిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినందుకు గాను నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ నాగరాజుకు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ అవార్డు దక్కింది. ఆ అవార్డును మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేష్‌భగవత్ అందజేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన పోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి వెయ్యి మంది బాధితులకు అందజేశారు. ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేకంగా హెడ్‌కానిస్టేబుల్ బాలకోటిని కేటాయించారు. దీంతో రాష్ట్రంలోనే నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్ర డీజీపీ ఎస్‌ఐకి ఉత్తమ అవార్డును అందజేశారు. అవార్డు రావడంపై ఎస్పీ శరత్ చంద్రపవార్, ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీ శివరాంరెడ్డిలు ఎస్‌ఐ నాగరాజును అభినందించారు.
వైద్య సేవల్లో ఆశవర్కర్లు ముందుండాలి
నల్లగొండ టౌన్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆశ వర్కర్లు ముందు వరుసలో నిలవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. మంగళవారం టీఎన్‌జీఓ భవన్‌లో ఆశ వర్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఆశ కార్యకర్తల సేవలు కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ఆశవర్కర్లపై ఉందన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ఆశవర్కర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ గీతావాణి, డాక్టర్ కేశ రవి, పీఓడీటీటీ డాక్టర్ కృష్ణకుమారి, డీటీసీఓ డాక్టర్ కళ్యాణచక్రవరి, డాక్టర్ పద్మ, డాక్టర్ అరుంధతి, డాక్టర్ రాజేష్, డీఎంఓ దుర్గయ్య, వెంకట్‌రెడ్డి, శాంతకుమారి, శ్రీనివాస స్వామి, సత్య, మహేశ్వరి, మోతీలాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment