సీఎం మూసీ బాట
● ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర
● భీమలింగం కత్వ వద్ద
పూజలు చేయనున్న సీఎం
● రైతులతో మాటామంతి
● యాదాద్రీశుడి దర్శనం అనంతరం మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ
● ఏర్పాట్లను పరిశీలించిన
కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 8వ తేదీన జిల్లాలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తన పుట్టిన రోజు కావడంతో ముందుగా యాదాద్రీశుడిని దర్శించుకుంటారు. అనంతరం వలిగొండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగం కత్వ వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడే మూసీ నది జలాలు పరిశీలించనున్నారు. అక్కడి నుంచి ధర్మారెడ్డి కాల్వ కత్వ వరకు మూడు కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. ఈసందర్భంగా మూసీ నది మురుగు నీటితో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. అదేమార్గంలో మూడు కిలోమీటర్లు వెనక్కి వచ్చి సంగెం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తం ఆరు కిలోమీటర్లు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేస్తూ పునురుజ్జీవం గురించి జిల్లా ప్రజలకు వివరించనున్నారు. అయితే వలిగొండ మండలం నాగారం నుంచి రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వరకు మూసీ నది వెంట సీఎం పర్యటించే మరో అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. యాదాద్రిలో ప్రత్యేక పూజల అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్‌లో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రారంభించనున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంత రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
వలిగొండ: వలిగొండ మండలంలోని సంగెం సమీపంలో గల భీమలింగం కత్వ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే మూసీ పునరుజ్జీవ పాదయాత్ర స్థలాన్ని, రైతులు, కులవృత్తుల వారితో నిర్వహించే సభా స్థలాన్ని మంగళవారం ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలుష్య కాసారంగా మారిన మూసీ నది పునరుజ్జీవం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని తెలి పారు. అనంతరం నాగారం సమీపంలోని ఆసిఫ్ నగర్ కాల్వ, రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం చెరువు కత్వను పరిశీలించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment