డీజేల వినియోగంపై నిషేధం
నల్లగొండ క్రైం: జిల్లాలో డీజేల వినియోగంపై ఈనెల 14 వరకు నిషేధం విధిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో వినియోగించే డీజేలతో అధిక సౌండ్ వల్ల ప్రజలు అనేక అసౌకర్యాలకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అధిక సౌండ్ కారణంగా ప్రజల మానసిక, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
బైపాస్ రోడ్డు సర్వే ప్రారంభం
నల్లగొండ టూటౌన్: నకిరేకల్ నుంచి మాచర్ల వరకు నిర్మించనున్న జాతీయ రహదారి 565 కోసం పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి బైపాస్ రోడ్డు కోసం అధికారులు గురువారం సర్వే ప్రారంభించారు. నల్లగొండ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్లడం ద్వారా భారీ వాహనాలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బైపాస్ రోడ్డు మంజూరు చేయించారు. దీంతో కొత్తగా పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి చర్లపల్లి మీదుగా, మర్రిగూడ గ్రామం వెనుక భాగం నుంచి ఎస్‌ఎల్‌బీసీ వద్ద జాతీయ రహదారి వరకు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బైపాస్ రోడ్డు వేయడం ద్వారా ఎంత భూమి అవసరం, ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి తీసుకోవాలనే అంశాల ఆధారంగా అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదికను అందించనున్నారు.
కమలానెహ్రూ ఏరియా
ఆస్పత్రికి కాయకల్ప అవార్డు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రి కాయకల్ప అవార్డుకు ఎంపికై ంది. ఆస్పత్రుల పరిశుభ్రత, వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలు తదితర అంశాలపై కేంద్ర బృందం సర్వే నిర్వహించారు. ఈమేరకు నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రి కాయకల్ప అవార్డుకు ఎంపికై నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆస్పత్రి అవసరాలకు రూ.లక్ష మంజూరు చేశారు.
కొనసాగుతున్న
సర్టిఫికెట్ల పరిశీలన
నల్లగొండ: డీఎస్సీ – 2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభించిన పరిశీలన రాత్రి వరకు కొనసాగిస్తున్నారు. బుధవారం మొదటి రోజు 212 మంది ఎస్‌జీటీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయగా రెండో రోజు గురువారం ఉదయం, సాయంత్రం వేళల్లో 501 అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 30 మంది సీనియర్ హెడ్మాస్టర్లు నల్లగొండ డైట్ కళాశాలలో పరిశీలన చేస్తున్నారు. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు సంబంధించి కోర్టులో వివాదం ఉన్నందున వారి సర్టిఫికెట్ల పరిశీలన జరగడం లేదు. ప్రస్తుతం మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి ఆయా కేటగిరిల్లో మొత్తం 1494 అభ్యర్థులకు గాను రెండు రోజుల్లో 713 మంది అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికట్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఇంకా 781 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది. ఇంకా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులు 4,5 తేదీల్లో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు.
వెస్ట్‌జోన్ ప్రీ రిపబ్లిక్
పరేడ్‌కు వలంటీర్ల ఎంపిక
నల్లగొండ రూరల్: మహారాష్ట్రలో నిర్వహించే వెస్ట్‌జోన్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ 2024కు ఈ నెల 5న ఎంజీ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల నుంచి వలంటీర్లు, ప్రోగ్రామ్ అధికారులు ఎంపికకు హాజరు కావాలని పేర్కొన్నారు. వలంటీర్లకు రన్నింగ్, పరేడ్, భాష పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అంశాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment