పక్క రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి
ఫ కలెక్టర్ నారాయణరెడ్డి
నల్లగొండ: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో భాగంగా పక్క రాష్ట్రం నుంచి జిల్లాకు ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేడ్ –ఏ ధాన్యానికి రూ. 2320, సాధారణ రకానికి రూ.2300 ప్రకటిస్తున్నందున పూర్తిగా ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు, తూర్పారా పట్టే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎం హరీష్, డీఆర్‌డీఏ శేఖర్‌రెడ్డి, వ్యవసాయాధికారి శ్రవణ్, చాయదేవి, మార్కెటింగ్ ఏడీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment