మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు
నల్లగొండ: దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేళ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగు రేఖలు సృష్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలిగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
డిండి: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో నెలకొన్న సమస్యలు, సిబ్బంది పనితీరుపై మండల వైద్యాధికారి ఎస్.శైలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని చెర్కుపల్లి, ఎర్రారం, జాల్‌తండా గామాలను సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కె.రవి, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీ సాయికుమార్ ఉన్నారు.
నల్లగొండ ఆర్డీఓగా అశోక్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
నల్లగొండ: నల్లగొండ ఆర్డీఓగా వై.అశోక్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు.వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వయంభూలను మేల్కొలిపారు. అనంతరం ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అర్చన, అభిషేకం చేశారు. ఇక ప్రధానాలయ ముఖమండపంలో అష్టోత్తర పూజలు, ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు.
తిరుమలగిరి మార్కెట్‌కు భారీగా ధాన్యం
తిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 15,956 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ బుధవారం తెలిపారు. గరిష్టంగా క్వింటాకు 2,109, కనిష్టంగా 1,906 రూపాయల ధర పలికినట్లు పేర్కొన్నారు.
మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం దీపావళి, శుక్రవారం అమావాస్య సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. తిరిగి నవంబర్ 2న మార్కెట్ యార్డును తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment