విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచాలి
నాగార్జునసాగర్: క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని బీసీ గురుకులాల నల్లగొండ ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకులాన్ని సందర్శించారు. పలు రికార్డులు, తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థుల ఆహారం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పీఈటీ గాయిత్రి, అధ్యాపకులు ఉన్నారు.
సబ్‌స్టేషన్‌కు తాళం వేసి గ్రామస్తుల నిరసన
వేములపల్లి(మాడ్గులపల్లి): విద్యుత్ అధికా రుల నిర్లక్ష్యంతో తమ ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోయాయని ఆరోపిస్తూ బుధవారం మాడ్గులపల్లి మండల కేంద్రం వాసులు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి వెళ్లే తడకమళ్ల విద్యుత్ లైన్‌కు హైపవర్ సరఫరా కావడంతో తమ ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, ఫ్యాన్‌లు కాలిపోయాయని, విద్యుత్ అధికారులను సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా విద్యుత్ కార్యాలయానికి తాళం వేయడంతో అధికారులు స్పందించి సమస్య పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
23న మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
నల్లగొండ: ఈనెల 23న మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని నల్లగొండలోని సాగర్ రోడ్డులో గల జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ లకుమల మధుబాబు తెలిపారు. నల్లగొండలోని శాంతినగర్‌లో గల మాల మహానాడు జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆ సమితి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి, సమితి రాష్ట్ర చైర్మన్ జి.చెన్నయ్య, కో చైర్మన్లు తాళ్లపల్లి రవి, మేక వెంకన్న, ఎర్రమళ్ల రాములు హాజరుకానున్న ఈ సమ్మేళనానికి మాలలు, మాల ఉద్యోగులు, కవులు, కళాకారులు, అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు చింతపల్లి లింగమయ్య, జిల్లా కమిటీ సభ్యులు భోగరి అనిల్, పురం వేణు, మాల ఎంప్లాయీస్ విభాగం కల్చరల్ సెక్రటరీ ఈసం యాదగిరి, రొయ్య కిరణ్, ముడుసు భిక్షం, అన్నిమల లింగస్వామి, గండమళ్ల విగ్నేష్ పాల్గొన్నారు.
ముగిసిన వాలీబాల్ పోటీలు
భువనగిరి: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఎస్‌జీఎఫ్ అండర్– 19 ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారం ముగిసాయి. ప్రథమ స్థానంలో టీజీఎంఎస్ తుర్కపల్లి, ద్వితీయ స్థానంలో హైదరాబాద్ జూనియర్ కళాశాల బొమ్మలరామారం, తృతీయ స్థానంలో టీజీఎస్‌డబ్ల్యూర్‌ఎస్‌జేసీ రాజపేట నిలిచాయి. విజేతలకు కప్‌తోపాటు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, పీడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment