కందిలో సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
నడిగూడెం : ప్రస్తుతం కంది పంట పూత, పిందె దశ ఆరంభమైంది. ఈ సమయంలో ఇప్పటి నుంచే పలు రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. ఇందుకుగాను రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు పాటించాలని నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్ తెలిపారు. కంది పంట సాగులో పాటించాల్సిన మెళకువలు ఆయన మాటల్లోనే..
ఆశించే పురుగులు, నివారణ చర్యలు..
ఆకుచుట్టు పురుగు : కంది చేను పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల నుంచి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా క్వినాల్‌ఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయతొలుచు పురుగు: ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి తింటుంది. ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది.
మారూక మచ్చల పురుగు : దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేదా థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మందులను మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.
కాయ ఈగ : కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం కనిపించదు. దీనివల్ల పురుగు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తుంది. ఈ పురుగు అన్ని దశలనూ కాయలోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిందె దశలో 5 శాతం వేప గింజల కషాయం పిచికారీ చేస్తే గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2.0 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నివారణ చర్యలు :
ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి.
● ఖరీఫ్‌లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సాళ్లు పెసర, మినుము, వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షిత పైరుగా విత్తాలి.
● పచ్చ పురుగును తట్టుకునే ఎల్.ఆర్.జి. 41 రకాన్ని సాగు చేయాలి.
● పైరు విత్తిన 90–100 రోజుల్లో చిగుళ్లపై ఒక అడుగు మేరకు కత్తిరించాలి.
● ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
● పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
● పురుగు గుడ్లను, తొలి దశ పురుగులను గమనించి వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా వేప సంబందిత మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల తేడాతో రెండు సార్లు సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.
● బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేదా చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి.
రసాయన పురుగు మందులను విచక్షణా రహితంగా వాడకూడదు.
సస్యరక్షణ చర్యలు తగిన సమయంలో చేపట్టకపోతే.. పురుగు ఉదృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, పూత లేదా కాయ దశలో క్వినాల్‌ఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి హ్యాండ్ కంప్రెషర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment