కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
బొమ్మలరామారం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి
మృతి చెందిన సంఘటన బొమ్మలరామారం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామానికి చెందిన జిన్న మల్లేష్(45) హైదరాబాద్ జవహర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మల్లేష్‌కు స్వగ్రామంలో పని ఉండడంతో తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై బొమ్మలరామారం వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో బొమ్మలరామారం శివారులో వెనుక వైపు నుంచి వచ్చిన కారు మల్లేష్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. మృతుడు జిన్న మల్లేష్ మత్స్య కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడని, గ్రామాల్లో తిరిగి చేపలు విక్రయించి స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మర్యాల మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు ప్యారారం రాములు కోరారు.
పత్తి కూలీల ఆటో బోల్తా
ఫ కూలీలకు తీవ్ర గాయాలు
నాంపల్లి: పత్తి కూలీల ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నాంపల్లి మండలంలోని గట్లమల్లేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బుధవారం గుడిపల్లి మండలంలోని ఘనపురం గ్రామానికి చెందిన 15మంది కూలీలు ఆటోలో నాంపల్లికి పత్తి తీయడానికి వచ్చారు. పని ముగించుకొని తిరుగు ప్రయాణమవ్వగా.. గట్లమల్లేపల్లి గ్రామ శివారులో మూలమలుపు వద్ద ఆటో బోల్తాపడింది. దీంతో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలుకాగా.. 10మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్కూటీని ఢీకొన్న లారీ.. బాలుడికి గాయాలు
మేళ్లచెరువు: స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి మల్లారెడ్డిగూడెం వైపు వెళ్తున్న లారీ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న రాచమడుగు మల్లికార్జునన్, కుమారుడు రోహిత్, చంద్రశేఖర్‌రావులు రోడ్డుపై పడిపోయారు. వీరిలో రోహిత్(8)కు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బైక్ అదుపుతప్పి
ఇద్దరికి గాయాలు
త్రిపురారం: రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం కుప్పలకు బైక్ తగలడంతో అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన త్రిపురారం మండలంలోని కుంకుడుచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలంలోని తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పు తండాకు చెందిన నాగు తన ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి అడవిదేవులపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా.. త్రిపురారం మండలంలోని కుంకుడుచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాగానే రోడ్డుపై ఉన్న వరి కుప్పలకు బైక్ తగిలి కింద పడ్డారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కాగా. రోడ్డుపై ధాన్యం కారణంగా ఇదే ప్రాంతంలో గతంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్డుపై ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment